నీరోను తలపిస్తున్న నారా పాలన

15 Apr, 2018 02:51 IST|Sakshi
శనివారం విజయవాడలోని చిట్టినగర్‌ సెంటర్‌ బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఓ భాగం.. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు

రాజధాని మొదలు హోదా వరకు పూటకో సినిమా, రోజుకో డ్రామా

చంద్రబాబు మాత్రం ఆయన, ఆయన బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు కాపాడతానని, అవినీతికి తావు లేకుండా చేస్తాం అని ప్రమాణం చేసిన ఈ పెద్దమనిషి.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన బినామీలకు చెప్పి దగ్గరుండి ఇన్‌సైడర్‌æ ట్రేడింగ్‌ చేసినందుకు, రైతుల్ని మోసం చేసినందుకు బొక్కలో వేయాల్సిన పని లేదా?  
 
నిజంగా ఈ పెద్దమనిషికి రాజధాని కట్టే ఉద్దేశం ఉంటే రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉండేవాడు. లేదు గనుకే హైదరాబాద్‌లో రాజభవనం కట్టుకున్నాడు. రైతులను మభ్యపెట్టేందుకు ప్లాట్లు ఇస్తానంటాడు. అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. రోడ్లు ఉండవు, కరెంట్‌ ఉండదు, డ్రైనేజీ ఉండదు. నీరు ఉండదు. అదిగో నీ ప్లాటు, ఇదిగో నీ ఫ్లాట్‌ అంటూ భ్రమరావతి .. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ అంటూ సినిమా చూపిస్తున్నాడు. ఇందులో హీరో లేడు. అంతా ఉత్తమ విలనే. ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఇక హీరో వస్తే తన్ని బొక్కలో వేయడమే.  

 
ఈ పెద్దమనిషి ఈరోజే (శనివారం) అన్నాడు. ఆయన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20న నిరాహార దీక్ష చేస్తాడట. ఏప్రిల్‌ అంటే 4, తేదీ 20.. అంటే 420. కొంగజపం చేస్తాడట. ఎంపీల చేత రాజీనామా చేయించకపోగా ఈ పెద్దమనిషి నిరాహార దీక్ష పేరుతో 420 పని చేస్తాడట. 5 కోట్ల ఆంధ్రులను వెన్నుపోటు పొడిచింది కాక.. దీక్ష చేస్తాడట. ఈ మనిషి తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.


ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిని భ్రమరావతిగా.. అవినీతికి మారుపేరుగా మార్చారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం మొదలు ప్రత్యేక హోదా వరకు పూటకో సినిమా, రోజుకో డ్రామా ఆడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 136వ రోజు శనివారం కృష్ణా జిల్లా విజయవాడలో అడుగుపెట్టిన ఆయన నగరంలోని చిట్టినగర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాజధానిలో ఒక్కటంటే ఒక్కటీ శాశ్వత నిర్మాణాన్ని చేపట్టలేదన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఓ భ్రమరావతి.. ఓ రాజధాని..
నాలుగేళ్లుగా నారా వారి పాలన.. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయిస్తా ఉన్నట్టుగా ఉంది. రాజధానిలో ఒక్క రాయి పడదు గాని స్కాంలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్లుగా మనందరికి సినిమాలు బాగా చూపిస్తున్నారు. అదిగో ఇంద్రలోకం.. ఇదిగో రాజధాని అంటూ మాయాబజార్‌ చూపిస్తున్నారు. రాజధాని ముసుగులో ఈయన తీసిన సినిమా పేరేంటో తెలుసా? ఓ భ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ.

ఆ కథ స్క్రిప్ట్‌ ఏంటో తెలుసా..? ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్‌ గీశాడు. రాజధాని ప్రాంతం ఎక్కడో చంద్రబాబుకు ముందే తెలుసు. నూజివీడు అన్నాడు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ అన్నాడు. అక్కడా కాదు ఏలూరని లీకులు ఇచ్చారు. ఇది నిజమేననుకుని చాలా మంది అక్కడకు వెళ్లి భూములు కొనుగోలు చేశారు.కానీ చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రం తుళ్లూరు ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు.

ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైనా రాజధాని ఫలాన ప్రాంతంలో వస్తుందని రైతులకు చెప్పి మేలు చేయాల్సింది పోయి దిక్కుమాలిన స్కెచ్‌ గీశాడు. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొన్న తర్వాత కొందరు బినామీలను ల్యాండ్‌ పూలింగ్, ల్యాండ్‌ అక్విజిషన్‌ పేరిట బయటపడేసేలా నోటీసులు ఇచ్చారు. కొంత మంది బినామీలను మాత్రం ల్యాండ్‌ పూలింగ్‌లోకి తీసుకొని వారికి మంచి రోడ్లు, పార్కింగ్‌ ఉండే మంచి ప్రాంతాలలో లాటరీ ద్వారా ప్లాట్లు ఇచ్చారు. వాళ్లకు అక్కడే ప్లాట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాదు. ఈ రాజకోట రహస్యం ఏమిటో అంతుబట్టదు.

అంతటితోనే ఆ సినిమా ఆగిపోలేదు. వ్యతిరేకించిన రైతుల్ని టార్గెట్‌ చేశారు. వాళ్లను హింసలు పెట్టారు. ఇదేం అన్యాయమని అడిగితే వీళ్లు రాజధానికి వ్యతిరేకులంటూ బురద వేస్తాడు. ఇంతటితోనే ఆయన భూ దాహం ఆగలేదు. చెరకు తోటల్ని తగలబెట్టించారు. అరటి తోటల్ని నరికి వేయించారు. ల్యాండ్‌పూలింగ్‌కు తాము వ్యతిరేకమన్నా ఖాతరు చేయకుండా బలవంతంగా భూములు లాక్కున్న చరిత్ర ఈ చంద్రబాబుది.

అసైన్డ్‌ భూముల్ని, లంక భూముల్ని, పేదల భూముల్ని లాక్కున్నారు. పేదల భూముల జోలికి వెళ్లేందుకు ఎవరైనా వెనకాడతారు. పాపం అంటారు. చంద్రబాబు రాక్షసు డు, దెయ్యం కాబట్టే ఆ పేదవాడి భూములను, అసైన్డ్, లంకభూముల్ని అడ్డగోలుగా దోచేశారు. ఆ తర్వాత రెండు జిల్లాలను జోనింగ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో తన బినామీలను ఉంచారు. వాళ్లకు ఎవ్వరూ పోటీ లేకుండా చేశారు. మిగిలిన రైతుల భూములను అగ్రికల్చర్‌ జోన్‌లో పెట్టారు. అంతటితో ఈ స్కాం ఆగదు.

సినిమాలో ఇంకో అంకం ఏమిటంటే..
బాబు తన నాలుగేళ్లలో 23 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఒకసారి సింగపూర్, మరోసారి టర్కి, దుబాయి అంటూ పిట్టల దొర మాదిరిగా బుల్లెట్‌ ట్రైన్, ఎయిర్‌ బస్సులు, ట్యూబ్‌ రైలు, వందంతస్తుల భవనాలు, మైక్రోసాఫ్ట్‌లు అంటూ మభ్యపెడతారు. ఇదంతా ఎందుకో తెలుసా? తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్ముకునేందుకు చంద్రబాబు ఆ భూములను అప్పగిస్తారు. రాజధానిలో పర్మినెంట్‌ పేరుతో ఒక ఇటుక కూడా పెట్టరు.

టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ అంటాడు. వాటి నిర్మాణానికి అడుగుకు రూ.10 వేలు ఇచ్చాడు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఆలోచించండి. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు నిజంగా రాజధాని కట్టే ఉద్దేశం ఉందా? అడుగుకు రూ.4 వేలో, రూ.6 వేలతోనో పర్మినెంట్‌ సచివాలయం కట్టించవచ్చు కదా? ఏ సినిమాకు వెళ్తే ఆ సినిమా సెట్టింగ్‌ అంటారు. ఒకసారి బాహుబలి సెట్టింగ్‌ అంటాడు. ఆ సినిమా డైరెక్టర్‌ను పిలుస్తారు. ఆ సెట్టింగ్‌లు, ఈ సెట్టింగ్‌లు అంటూ మనకు సినిమా చూపిస్తాడు. ఏదేశం వెళితే ఆ దేశం సినిమా మనకు చూపిస్తాడు.  

కంపించిన వారధి 
వైఎస్‌ జగన్‌ వెన్నంటి వేలాది మంది తరలిరావడంతో కనకదుర్గ వారధి కిక్కిరిసిపోయింది. జనవాహిని  తాకిడికి వారధి కొంచెంసేపు కంపించింది. జగన్‌ భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణ కవచంగా నిలిచారు. ఎక్కడివారు అక్కడ కొద్దిసేపు కదలకుండా నిలబడితే వారధి కదలికలు తగ్గుతాయని పాదయాత్ర నిర్వాహకులు మైక్‌లో అందర్నీ కోరారు. దాంతో అంద రూ ఎక్కడివారు అక్కడ నిలబడిపోయారు.

వారధి కంపించడం తగ్గాక పాదయాత్ర సాగించారు. దీనిపై జాతీయ రహదారుల కన్సల్టెంట్‌ ఇంజినీర్‌ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ వారధికి దిగువున బేరింగ్స్‌ ఉంటాయని, భారీ వాహనాలు కానీ, భారీగా జనం వెళుతున్నప్పుడు గానీ బేరింగ్స్‌ కదిలి  ప్రకంపనలు వస్తాయని చెప్పారు. దీనిపై విచారణ చేయించడంతో పాటు వారధిని పరీక్ష చేయిస్తామన్నారు.

మరిన్ని వార్తలు