హోదా పోరులో మేము సైతం..

6 Apr, 2018 02:47 IST|Sakshi

పాదయాత్రలో కదంతొక్కుతూ.. మమేకమవుతున్న యువత

సోషల్‌ మీడియా వేదికగా మదిలో భావాలను షేర్‌ చేస్తున్న వైనం

రూటు మార్చిన నిఘా విభాగం.. ఇకపై ఏం చేయబోతున్నారని ఆరా

అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలకు జననేత ఆత్మీయ పలకరింపు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హోదా పోరులో తామూ భాగస్వాములవ్వాల్సిన సమయం ఆసన్నమైందని జననేత అడుగులో అడుగేస్తున్న యువత భావిస్తోంది.  గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గురువారం సాగిన 129వ రోజు పాదయాత్రలో యువకులు, విద్యార్థులు, మహిళలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు జననేతను పెద్ద సంఖ్యలో వెన్నంటారు.

తాజా పరిణామాలపై లోతుగా చర్చించుకోవడం కనిపించింది. జగన్‌ సంకల్ప దీక్షను ముందుకు తీసుకెళ్లడం చారిత్రక అవసరమన్న అభిప్రాయం వాళ్ల నుంచి వ్యక్తమైంది. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఒక పక్క టీడీపీ కేడర్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం.. దీన్ని తిప్పికొట్టేందుకు జగన్‌ అభిమానులు ప్రయత్నిస్తుండటం రాజకీయ వేడి పుట్టిస్తోంది.

జగన్‌ మాట.. జనం బాట..
‘సమస్యలు చెప్పుకుంటున్న వారిని చూస్తున్నాం.. జననేత వారికి ధైర్యం చెబుతుండటాన్నీ పరిశీలిస్తున్నాం.. ఆ తర్వాత వాళ్ల మనోభావాలను తెలుసుకుంటున్నాం. వాళ్లు ఇంకేం కోరుకుంటున్నారో గుర్తించి, దాన్ని మా నేత జగన్‌ దృష్టికి తీసుకెళ్తాం’ అని వేజెండ్లకు చెందిన బీటెక్‌ విద్యార్థి శ్యాంప్రసాద్‌ తెలిపారు. హోదా ఉద్యమ సెగ పుట్టిన తర్వాత జగన్‌ పట్ల తనకు మరింత విశ్వాసం పెరిగిందన్నాడు. వ్యవస్థను బాగు చేయడానికి ఉపక్రమించిన ఆయనకు తోడుగా ఉంటానని చెప్పాడు.

జగన్‌ ప్రసంగంలోని ప్రతీ అంశాన్ని క్రోడీకరించి వాట్సాప్‌ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. ‘చంద్రబాబును క్షమిస్తే పెద్ద పెద్ద మోసాలతో ముందుకొస్తాడ’ని జగన్‌ ప్రతీ సభలోనూ చెప్పే అంశాన్నే ఆయుధంగా చేసుకున్నాడు వడ్లమూడికి చెందిన నాగ చైతన్య. ఇంజినీరింగ్‌ చదివే ఇతను జగన్‌ సారథ్యంలో మంచి పాలన రావాలని ఆకాంక్షిస్తున్నాడు.

పాదయాత్రలో పాల్గొంటూనే.. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మోసాలు, అవినీతి, అక్రమాలను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారంలోకి తెస్తున్నట్లు తెలిపాడు. శేకూరుకు చెందిన కల్పన, పల్లవి, ప్రణతిలు జగన్‌ ప్రతీ కామెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ‘ఒక్కో పోస్టుకు వేలల్లో లైక్‌లు వస్తున్నాయి’ అని ప్రణతి చెప్పింది. జనం బాటలోనే నడుస్తున్న జగన్‌ అడుగులో ప్రతి ఒక్కరూ అడుగేయాలన్నదే తమ కోరికని, దీనికి సామాజిక మాధ్యమాన్ని వాడుకుంటున్నామని గరువుపాలెంకు చెందిన సంధ్య తెలిపింది. రెండు రోజులుగా ఆమె పాదయాత్రలో పాల్గొంటోంది.

బాబూజీకి నివాళి.. బాధితులకు భరోసా..
బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించిన తర్వాత గురువారం జగన్‌ తన పాదయాత్రను మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. ‘అన్నా ఉద్యోగం తీసేసే కుట్ర చేస్తున్నారన్నా.. టీడీపీ వాళ్లను తెచ్చుకునే కుయుక్తులు పన్నుతున్నారన్నా..’ అంటూ కాంట్రాక్టు లెక్చరర్లు జననేత ఎదుట బావురుమన్నారు.

మీ నాన్నగారే మాకు ఈ ఉద్యోగాలిచ్చారన్నా... చంద్రబాబు అన్యా యం చేస్తున్నాడన్నా అనేది వాళ్ల ఆవేదన. ఇదే తరహాలో రోడ్డున పడ్డ నిరుద్యోగులు.. బాబు మోసాలకు బలైన యువత.. కష్టాల సుడిలో ఒడ్డుకోసం వెతికే పేదలు జగన్‌ను కలిశారు. ఆయన వాళ్లందరినీ గుండెలకు హత్తుకుని ఓదార్చారు. మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘నువ్వు సింహంలా ఉండాలన్నా.. ఇది నా కూతురు ఆకాంక్ష’ అని శ్రీనివాసరెడ్డి అనే అభిమాని జగన్‌కు ఓ సింహం బొమ్మ బహూకరించాడు.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆయన కూతురు సౌమ్య దివంగత నేత రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులు చదివిందని చెప్పడంతో జగన్‌ ముఖంలో పట్టరాని ఆనందం కనిపించింది. ఆ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ.. జనం గుండెల్లోని కష్టాలు వింటూ.. వారికి ధైర్యం చెబుతూ జగన్‌ ముందుకు సాగారు.


వాట్‌ నెక్ట్స్‌..?
వడ్లమూడి వద్ద గురువారం ఎదురైన ఓ నిఘా  అధికారి  ఆసక్తిగా మాట్లాడారు. తమ సమాచార సేకరణలోనూ మార్పు వచ్చిందని చెప్పారు. సంకల్పయాత్రలోనే జగన్‌ కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘ఇంతకాలం పాదయాత్రకు ఎంత మంది వచ్చారు? ఎవరు వచ్చారు? జగన్‌ ఏం మాట్లాడుతున్నారు? అని పైవాళ్లు మమ్మల్ని అడిగేవాళ్లు. ఇప్పుడు మాత్రం ‘వాట్‌ నెక్ట్స్‌?’ అని ప్రశ్నిస్తున్నారు.

ప్రతీ సభలోనూ జగన్‌ చెప్పే మాటల తీవ్రత ఎంత? జాతీయ, రాజకీయ పరిణామాలపై ఆయన కోణం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆమరణ దీక్షకు పాదయాత్ర సభ నుంచే జగన్‌ పిలుపునిచ్చారు. ఇది రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. అప్పటి నుంచి ప్రభుత్వం నిఘా బృందాలను పెంచినట్టు సమాచారం. జగన్‌ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ సైన్యమే సిద్ధమవుతోందని వారు అభిప్రాయçపడడం విశేషం.

>
మరిన్ని వార్తలు