కుమ్మరి కుంటలూ కబ్జా

27 Apr, 2018 03:20 IST|Sakshi
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఇందుపల్లిలో కుమ్మరి చక్రంపై నుంచి కుండను తీస్తున్న వైఎస్‌ జగన్‌

కుండల తయారీకి మట్టినీ దొరకనీయడం లేదు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట కుమ్మరుల ఆవేదన

వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడినని రుణం ఆపేశారని కల్లుగీత కార్మికుడి ఆవేదన

అందరి సమస్యలు విని ధైర్యం చెప్పిన జననేత

మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘అన్నా.. ఇక్కడ కుండలు కూడా చేసుకోనీయడం లేదు. మాకు ఇచ్చిన కుంటల్లోని మట్టిని టీడీపీ నేతలు తరలించి అమ్ముకుంటున్నారు. కుండలు చేసుకోడానికి మట్టిని కూడా దొరకనీయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా కోసం చట్టం చేయాలి’ అని కుమ్మరి కులస్తులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 146వ రోజు గురువారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగింది.

నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంలో పలు కష్టాలు పడుతున్నామని వివిధ వర్గాల ప్రజలు జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇందుపల్లి గ్రామంలో రోడ్డుపక్కనే కుండలు చేసుకుంటున్న చెరుకుపల్లి సుబ్బారావు తన కష్టాన్ని జగన్‌కు వివరించారు. తామంతా కుండలు చేసుకుని జీవనాన్ని గడుపుతున్నామని, రోజంతా కష్టపడితే 15 నుంచి 20 కుండలు కూడా చేయలేకపోతున్నామని ఆయన కుటుంబీకులు వివరించారు. 

రోజుకు రూ.150కి మించి ఆదాయం రావడం లేదని, ఇంత తక్కువ ఆదాయంతో ఎలా బతకాలో తెలియక తల్లడిల్లుతుంటే.. కుండల తయారీకి అవసరమయ్యే మట్టినీ తీసుకుపోనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వాపోయారు. దీంతో రూ.3 వేలు చెల్లించి ట్రాక్టర్‌ మట్టిని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోయారు. వేసవిలో మినహా కుండలకు గిరాకీ ఉండదని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తమ కోసం చట్టం చేసి ఆదుకోవాలని కోరారు.  

రూ.కోట్లు తిన్నా పట్టించుకోలేదన్నా..
ధాన్యం కొనుగోలులో టీడీపీ నేతలు.. మిల్లర్లతో కుమ్మక్కయ్యి గన్నవరం ప్రాంతంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని గన్నవరం మండలం బుద్దవరానికి చెందిన సూరెడ్డి శ్రీమణి జగన్‌కు వివరించింది. 2014 నుంచి 2017 వరకు సాగిన ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని పూర్తి సాక్ష్యాధారాలను చూపించింది.

జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయింది. జగన్‌ సీఎం కావాలంటూ ఇందుపల్లి సెంటర్‌లోని సాయిబాబా ఆలయంలో మసిముక్కు వెంకటేశ్వరరావు, నాగపుష్ప దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి.. జననేతకు ప్రసాదం అందించారు.

మంజూరు చేసిన రుణాన్ని ఆపేశారు..
‘అయ్యా.. కల్లు గీత కార్మికుల ఫెడరేషన్‌లో 1986 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నాను. అప్పటి నుంచి గుర్తింపు కార్డు కూడా ఉంది. వయసు మీద పడటంతో కల్లు గీతకు చెట్లు ఎక్కలేకపోతున్నా. వ్యాపారం చేసుకోవడానికి ఫెడరేషన్‌ రూ.2 లక్షల రుణం మంజూరు చేస్తే.. టీడీపీ నేతలు దానిని ఆపేయించారు’ అని ఈరంకి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానిని కావడం వల్లే రుణం రానివ్వలేదన్నారు.

కంటికి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకున్నా.. చూపు సరిగ్గా రాలేదని.. ఆరోగ్యశ్రీ కింద కూడా పట్టించుకోవడం లేదని సరోజని అనే వృద్ధురాలు గోడు వెళ్లబోసుకుంది. పట్టిసీమ కట్టినా సాగునీరు అందడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో తాగునీటికీ ఇబ్బంది పడుతున్నామని పలువురు మహిళలు చెప్పారు. అందరి కష్టాలను జగన్‌ ఓపికగా విన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. కాగా, ఇందుపల్లిలో టీడీపీ నేతల బెదిరింపులను బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు జననేత అడుగులో అడుగేశారు.  


                                   (పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత)

మరిన్ని వార్తలు