గిరివాసుల గుండెల్లో కొండంత దేవుడు

1 Apr, 2019 13:20 IST|Sakshi
చిలకలపుట్టులో పక్కా గృహాలు

ఆపదలో అండగా నిలబడ్డ రాజశేఖరుడు

మన్యంవాసులకు పక్కా ఇళ్ల కేటాయింపు

వివిధ గ్రామాల్లో మోడల్‌ కాలనీల నిర్మాణం

వరదపాలైన ఊరిని సందర్శించి మోడల్‌ కాలనీ మంజూరు

బాధల్లో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలవడం ఆయన నైజం. కష్టాల్లో ఉన్నవారి పక్షాన నిలబడి వారి పెదాలపై చిరునవ్వుగా మెరవడం ఆయన లక్షణం. జీవితం అడుగడుగునా ఇదే స్వభావాన్ని కనబరిచిన రాజశేఖరుడు గిరివాసుల సమస్యల విషయంలోనూ అదే విధంగా స్పందించడం సహజం. అందుకే ఆయన వాళ్ల సమస్యలు విని, చూసి చలించిపోయాడు. గూడు లేని ఎందరికో ఇళ్లిచ్చిన రాజశేఖరుడు గిరిజనుల గుండెల్లో దేవుడై మిగిలాడు.

అరకులోయ: మరువలేని మహానేత రాజశేఖరరెడ్డిని మన్యంలో గిరిజనులు గుండెల్లో గూడుకట్టుకుని పూజిస్తున్నారు. మట్టిగోడల నడుమ, పూరి గుడిసెల్లో నివసించే తమకు పక్కా ఇళ్లిచ్చి భద్రత కల్పించిన దేవుడని ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా తెల్ల కార్డున్న ప్రతీ కుటుంబానికి పక్కా గృహం మంజూరు చేయడంతో ఆ ప్రయోజనం పొందిన వారంతా  ఆయన తమ పాలిట దేవుడని అర్చిస్తున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్‌ గిరిజనుల కష్టాలపై దృష్టి సారించారు. గతంలో పాలించే వారంతా గిరిజనులకు కేవలం పెంకులు మాత్రమే పంపిణీ చేసేవారు. ఆ పెంకులను మట్టిగోడలపై వేసుకుని, గిరిజనులు కూలే గుడిసెల్లోనే జీవించేవారు. వైఎస్‌ మాత్రం ఇందిరమ్మ పథకంలో పక్కాగహం మంజూరు చేసి, రికార్డు సష్టించారు. మట్టిగోడల ఇళ్ల స్థానంలో సిమెంట్‌గోడలతో కూడిన రేకులు, శ్లాబ్‌ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పాడేరు డివిజన్‌లోని 11మండలాల పరిధిలో 70 వేల కుటుంబాలకు పక్కా ఇళ్లు మొదటి, రెండో విడతలో నిర్మించారు. అందుకే ఏ గ్రామం చూసినా ఇందిరమ్మ ఇళ్లతో అందంగా దర్శనమిస్తుంది.

చిలకలపుట్టు కళకళ
వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో అరకులోయ మండలంలోని కోడిపుంజువలస గ్రామం వరదలో కొట్టుకుపోయింది. వరదలో ఎందరో గిరిజనులు మృత్యువాతపడ్డారు.గుడిసెల ఇళ్లని వరదలోనే కొట్టుకుపోయాయి. ఈ ఘోరం గురించి తెలిసిన వైఎస్‌ ఏజెన్సీలోని కొండ అంచున, దిగువన ఉన్న గ్రామాలను గుర్తించి, సురక్షిత ప్రాంతాలలో మోడల్‌ కాలనీలు నిర్మింపజేశారు. కోడిపుంజువలసతో పాటు,ఏజెన్సీలోని అనేక గ్రామాలలో మోడల్‌ కాలనీలను నిర్మింపజేసి అన్ని సదుపాయాలను కల్పించారు. హుకుంపేట మండలంలోని చిలకలపుట్టు అభివృద్ధికి రికార్డు స్థాయిలో రూ.57లక్షలను డాక్టర్‌ వైఎస్సార్‌ మంజూరు చేసారు. 83 కుటుంబాలకు సిమెంట్‌ రేకుల పక్కా గహాలను నిర్మించారు. గ్రామస్తులంతా వైఎస్‌ను ఇప్పటికీ దైవంలా కొలుస్తారు.

విలయానికి చలించి..
కోడిపుంజువలస గిరిజనులది మరింత దీన గాథ. ఈ గ్రామాన్ని 2005, ఆగస్టులో వరద ముంచెత్తింది. కొండ చరియలు విరిగిపడి, అర్థరాత్రి బీభత్సం నెలకొంది. 36 గిరిజనుల నివాసాలు కొట్టుకుపోయాయి. 19మంది గిరిజనులు గల్లంతయ్యారు, అప్పటి ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఈ సంఘటన గురించి వైఎస్‌కు ఫోన్‌లో వివరించడంతో, ఆయన మర్నాడు ఉదయాన్నే హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చేశారు. గ్రామంలో యుద్ధ ప్రాతిపదికపై 78 పక్కా గృహాలతో మోడల్‌ కాలనీని నిర్మింపచేశారు. విద్యుత్తు, రహదారులు సహా అన్ని మౌలిక సదుపాయాలను కల్పింపచేశారు. సంఘటనలో 19 మంది మృతి చెందగా ప్రతీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అందరినీ పూర్తిగా ఆదుకున్నారు.

మరిన్ని వార్తలు