పిల్లి అరిస్తే.. పులి అవుతుందా?

2 Apr, 2019 05:20 IST|Sakshi

చంద్రబాబు ఇవాళ ఆయనకు ఏమాత్రం సరిపడని మాటలు చెబుతున్నారు

పౌరుషం, నీతి నిజాయితీ గురించి ఆయన మాట్లాడటం ఏమిటి?

పొత్తులు లేకుండా ఒక్క ఎన్నికలోనూ ఆయన గెలవలేదు

చంద్రబాబు మిమ్మల్ని ఓట్లడిగితే ముందు బాకీలు తీర్చమనండి

జగనన్నకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి

‘‘ఇవాళ చంద్రబాబు ఆయనకు ఏమాత్రం సరిపోని కొత్త మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషం, నీతి నిజాయితీ గురించి చంద్రబాబా మాట్లాడేది? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందని అరిస్తే అది పులి అయిపోతుందా? పిల్లి పిల్లే... పులి పులే. చంద్రబాబు నిస్సిగ్గుగా ఇప్పుడు మళ్లీ పవన్‌కల్యాణ్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఏ ఒక్క ఎన్నికలోనూ ఆయన సొంతంగా గెలిచింది లేదు. వైఎస్సార్‌సీపీ పొత్తులు లేకుండా బంపర్‌ మెజార్టీతో గెలవబోతోందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. మాకు పొత్తులు అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది దేవుడి దయ, మీ దీవెనలు. అంతే..’’

‘‘పవన్‌ కల్యాణ్‌ ఒక యాక్టర్‌... ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్‌. ఒక యాక్టర్‌ డైరెక్టర్‌ చెప్పినట్లు చేయాలి కనుకనే పవన్‌ చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారు. కరెక్టే చేస్తున్నారు కదా? ఇద్దరూ కలిసే ఉన్నారు కదా? ఇద్దరూ సీట్లు పంచుకుంటున్నారు కదా. పవన్‌కల్యాణ్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశాడు. అన్నకు, తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా? పవన్‌ కూడా ఇప్పుడో, ఎప్పడో జనసేన పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు. కాకపోతే ఆయన టీడీపీకి అమ్మేస్తారు. అందుకే చెబుతున్నా జనసేనకు ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే. చంద్రబాబు – పవన్‌ ఇద్దరూ ఒకటే’’

సింహం సింగిల్‌గా వస్తుంది...నక్కలే గుంపులుగా వస్తాయి....జగనన్నకు ఎవరితోనూ పొత్తు లేదు.. ఆ అవసరం కూడా లేదు.. చంద్రబాబుకు బీజేపీ, కాంగ్రెస్, జనసేనతో పొత్తులున్నాయి... మరి ఎవరు
సింహం.. ఎవరు నక్క? ఇందులోనే తేలిపోవట్లేదా? 

– తెనాలి, పొన్నూరు, బాపట్ల, పెనమలూరు సభల్లో షర్మిల

సాక్షి, అమరావతి బ్యూరో, బాపట్ల: ‘ఓదార్పు అనే ఒక్క మాటను నిలబెట్టుకోవడం కోసం జగనన్న కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలుసు. పొత్తులు లేకుండా ఒక్క ఎన్నికలో కూడా గెలవలేని చంద్రబాబు నిస్సిగ్గుగా మాకు బీజేపీతో, కేసీఆర్‌తో పొత్తులున్నాయని ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే అంటున్నా పులి పులే.. పిల్లి పిల్లే. మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. జగనన్న సింహంలా సింగిల్‌గా వస్తారు’ అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల స్పష్టం చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల, తెనాలి, కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

మన చెవిలో పువ్వులు, క్యాబేజీలు కనిపిస్తున్నాయా?
‘‘వైఎస్సార్‌ సుపరిపాలన గురించి ఇవాళ నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒక్క రోజు కూడా పన్నులు పెంచకుండా, కులమతాలకు అతీతంగా అందరికీ మేలు చేశారు. చంద్రబాబు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించారు. పసుపు–కుంకుమ అంటూ మళ్లీ మభ్యపెడుతూ వడ్డీకి కూడా చాలని విధంగా ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక అప్పులపాలై ఎంతోమంది విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తుంటే ఆ పాపం చంద్రబాబుది కాదా? ఆరోగ్యశ్రీలో ఇవాళ కార్పొరేట్‌ ఆస్పత్రులు లేవు. పేదలకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళతారా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించేది ఇలాగేనా? రాజధానిలో ఒక్కటైనా శాశ్వత భవనానికి దిక్కులేదుగానీ అమరావతిని అమెరికా చేస్తానంటున్నాడు. శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తానంటున్నాడు. మన చెవిలో పువ్వులు, క్యాబేజీలు పెడుతున్నాడు. 

కేసీఆర్‌ను ప్రాధేయపడినప్పుడు పౌరుషం చచ్చిపోయిందా?
చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆయనకు ఏమాత్రం సరిపడని పదాలు వాడుతున్నారు. పౌరుషం, రోషం.. అంటున్నారు. జగన్‌కు అవి లేవు, లొంగిపోయాడంటున్నారు. పౌరుషం గురించి చంద్రబాబా మాట్లాడేది? ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోతే అల్లుడని జాలిపడి ఎన్టీఆర్‌ టీడీపీలో చేర్చుకున్నారు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని అవసరం వచ్చినప్పుడల్లా వాడుకుని వదిలేశాడు. ఆయన చేతిలో మన భవిష్యత్తును పెడితే సర్వ నాశనం చేస్తాడు.

సోనియాగాంధీని దయ్యం అని విమర్శించి ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన పౌరుషం అప్పుడు బజారుకు వెళ్లిందా? బీజేపీతో పొత్తు పెట్టుకోనని 2004లో చెప్పాడు. మళ్లీ 2014లో అదే పార్టీతో పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు సంసారం చేశాడు. అప్పుడు ఆయన పౌరుషం నిద్రపోయిందా? హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడారు. అప్పుడు ఆయన పౌరుషం చచ్చిపోయిందా? చంద్రబాబు మీ ఓట్లను డబ్బుతో కొనేందుకు వస్తున్నారు. కానీ ఎన్ని డబ్బులిచ్చినా ఆయన మీ బాకీని తీర్చలేరు. గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఓట్లు అడగటానికి వస్తే మీకిచ్చిన హామీలను బకాయిలతో సహా చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. 

లోకేష్‌కు 3 ఉద్యోగాలు.. యువతకు నిరుద్యోగం
బాబొస్తే జాబొస్తుందన్నారు. కానీ కరువొచ్చింది. ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఈ పప్పుగారికి కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవని లోకేష్‌కు ఏ అర్హత, అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు? హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానాన్ని కూడా ఆమోదించారు చంద్రబాబు. ఆయనది రెండు నాల్కల ధోరణి కాబట్టే రెండు వేళ్లు చూపిస్తుంటాడు. ఇంత అసమర్థ సీఎం మళ్లీ కావాలా? చెప్పింది చేసేవారు కావాలన్నా, రైతు మళ్లీ రాజు కావాలన్నా జగనన్న రావాలి. అందుకే ప్రజాతీర్పు బైబై బాబు.. కావాలి. 11వ తేదీన మీరంతా ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకుని మీకు సేవ చేసే అవకాశం జగనన్నకు ఇచ్చి ఆశీర్వదించండి’’

మరిన్ని వార్తలు