జగనన్నకి ఒక్క అవకాశం ఇవ్వండి: షర్మిల

1 Apr, 2019 12:33 IST|Sakshi

మాకు పొత్తు అవసరమా?

కేసీఆర్‌, బీజీపీతో మాకు ఎలాంటి పొత్తు లేదు

సింహం సింగిల్‌గానే వస్తుంది

సాక్షి, బాపట్ల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరితోనూ పొత్తు లేదని,  ఒంటరిగానే పోరాటం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు. ఎన్నికల ప‍్రచారంలో భాగంగా వైఎస్‌ షర‍్మిల సోమవారం బాపట్లలో రోడ్‌ షో నిర్వహించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెలవేర్చలేదని, జయంతి,వర్థంతికి తేడా తెలియని పప్పుకు మూడు శాఖలు కేటాయించడం విడ్డూరమని ఆమె విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ... ‘టీడీపీ గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటూ ముందుకు వెళుతోంది. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకునే... ఇంగిత జ్ఞానం లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడిన

చంద్రబాబు...శవ రాజకీయాలు చేశారు. అలాంటి ఆయన వైఎస్సార్ సీపీ ఆ పార్టీతో పొత్తు, ఈ పార్టీతో పొత్తు పెట్టుకుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మాకు బీజేపీతో పొత్తు లేదు, కేసీఆర్‌తో పొత్తులేదు. అసలు మాకు ఆ అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అన్న... ఆ తర్వాత అమ్మ... అనంతరం కూడా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోరాటం చేశాడు.

సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎవరితో పొత్తు లేకుండా సింగిల్‌గానే జగనన్న మీ ముందుకు వస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో మన పార్టీ గెలిచే సీట్లు అన్ని సింగిల్‌గానే గెలుద్దాం. వైఎస్సార్‌ సీపీ ఏ పొత్తు లేకుండా బంపర్‌ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెబుతున్నాయి.  ఒక్క అవకాశం జగనన్నకు ఇమ్మని, మిమ్మల్ని కోరుకుంటూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయమని ప్రార్థిస్తున్నాను. వైఎస్సార్‌ సీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌కు అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందాం. మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వారిద్దర్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.’ అని కోరారు. 

మరిన్ని వార్తలు