‘కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారు’

31 Mar, 2019 22:18 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్సార్‌ పాలన చూస్తే తెలుస్తుందని, ఎలా ఉండకూడదో చంద్రబాబు పాలన చూస్తే తెలుస్తుందని కేవలం కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య పథకాలను నిర్వీర్యం చేశారని పేదవాడు వైద్యం కోసం గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లాలా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. 

అమరావతిలో భూములు లాక్కుని తన బినామీలకు కేటాయించారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. పప్పుకు మాత్రమే జాబు వచ్చిందన్నారు. లోకేష్‌కు జయంతికి, వర్దంతికి తేడా తెలీదన్నారు. ఒకటి కాదు, రెండు కాదు , మూడు శాఖలకు లోకేష్‌ను మంత్రిని చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుమారుడికి మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు..కానీ సామాన్యులకు మాత్రం ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు.

మన రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన హోదాను అడ్డుకున్నారని అన్నారు. హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు హోదా అన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారని మళ్లీ ఇప్పుడు హోదా అంటున్నారని విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెంటుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తని చంద్రబాబు అంటున్నారని అన్నారు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషమని దుయ్యబట్టారు. చంద్రబాబు వేషాలు చూసి.. ఊసరవెళ్లి కూడా పారిపోతుందన్నారు. జగనన్న పోరాటాలతోనే హోదా అంశం సజీవంగా ఉందన్నారు. హోదా కోసం జగన్‌ ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో యువభేరీలు పెట్టి యువతను జాగృతం చేశారని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, వైఎస్సార్‌ ఎంపీలు రాజీనామా చేశారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు