ఈసారి మోసపోవద్దు : విజయమ్మ

4 Apr, 2019 19:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు అబద్దపు హామీలకు మరోసారి మోసపోవద్దని, రాజశేఖర్‌ రెడ్డి పాలన మళ్లీ రావాలంటే.. వైఎస్‌ జగన్‌ ద్వారానే అది సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చాడు.. కానీ ఏ ఒక్కరికీ మేలు జరగలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గోకవరంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..

కాంగ్రెస్‌కు అది నచ్చలేదు..
రాజశేఖర్‌ రెడ్డి మరణవార్త తెలియగానే చాలామంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు సాయం చేయాలనుందని జగన్‌ బాబు అన్నారు. వారి కుటుంబాలను ఓదార్చాలని అనుకున్నాడు. అయితే దీనికి కాంగ్రెస్‌ ఒప్పుకోలేదు. అయినా ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఈ గోదావరి జిల్లాలోనే ఓదార్పును మొదలుపెట్టారు.. నా బిడ్డ మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే.. మీరే నా బిడ్డకు ఓదార్పునిచ్చారు. రాజశేఖర్‌ రెడ్డి కోసం అంతమంది చనిపోవడం.. జగన్‌ ఓదార్పు చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. జగన్‌ చేసే ఓదార్పుకు ఎమ్మెల్యేలు, ఎంపీలను వెళ్లొద్దని హెచ్చరించారు. అలా చాలా మంది నాయకులు మాకు దూరమయ్యారు. అప్పుడూ ఇప్పుడూ మీరే అండగా ఉన్నారు. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటుంది.

మీరంతా అండగా ఉన్నారు..
నాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడైనా, జగన్‌, షర్మిల పాదయాత్ర చేసినప్పుడైనా.. మీరంతా అండగా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు కూడా మీరు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్‌ అంటే వైఎస్సార్‌.. వైఎస్సార్‌ అంటే కాంగ్రెస్‌.. అనే స్థాయికి మహానేత ఎదిగారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుటి నుంచి మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి పార్టీకి జీవం పోశారు. అలాంటి వైఎస్‌కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగారు. మా కోసం బయటకు వచ్చిన 18ఎమ్మెల్యేలను, ఎంపీని గెలిపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు మేము బయటకు వచ్చాము. నాకు, షర్మిలకూ మీరు అండగా నిలిచారు. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఈ కట్టె కాలేవరకు.. రాజశేఖర్‌ రెడ్డి లేని లోటు నాకైతే ఉంటుంది. కానీ, మీకు రాజన్న పాలనను మళ్లీ అందించడానికి జగన్‌ ఉన్నాడు. 

ఇన్నేళ్లు ఎక్కడికి పోయావు
ముఖ్యమంత్రి మాటకు, సంతకానికి విలువ లేకుండాపోతుంది. ఆ రోజు రుణమాఫీ చేయమని జగన్‌కు అందరూ చెప్పారు.. చేయలేనిది చేయలేననే చెబుతాను అబద్దం చెప్పడం మా నాన్న నాకు నేర్పించలేదు.. అని తన అన్న మాటకు జగన్‌ కట్టుబడిఉన్నాడు. మాట ఇస్తే కట్టుబడి ఉండాలి. కానీ చంద్రబాబు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చారు. జగన్‌ నవరత్నాల్లో భాగంగా.. రైతు చేతుల్లో ఏడాది 12,500 పెడతానంటే.. చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ గుర్తొచ్చింది. తనకు కోటిమంది అక్కాచెల్లెలు అని..తాను పెద్దన్నయ్య అని చెప్పుకుంటున్నాడు. మరి ఇన్నేళ్లు ఎక్కడికి పోయావు. ఈ రోజు కొత్తగా పసుపు-కుంకుమ అని చెబుతున్నావు. 6400కోట్ల వడ్డీ కట్టకుండా ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు. రెండు రూపాయాలకే 20లీటర్ల నీళ్లు అన్నాడు.. ఈ రాష్ట్రంలో నీళ్ల కన్నా మద్యం ఎక్కువగా కనిపిస్తోంది. 

బాబు పాలనలో ఆడవాళ్లకు ఏ విధమైనటువంటి భద్రత లేదు. సంధ్యారాణి, శిల్పా డాక్టర్లు చనిపోయినా.. ప్రభుత్వాధికారిణి వనజాక్షిని జుట్టపట్టుకుని లాగినా.. ఎటువంటి యాక్షన్‌లు తీసుకోరు. పైగా ఆ పని చేసిన వారికే మళ్లీ టిక్కెట్లు ఇస్తారు. 2.40లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఆరోగ్య శ్రీ , ఫీ రీయింబర్స్‌మెంట్‌ను గాలికొదిలేశారు. రైతులకు ఏడాదికి 12500, ఉచిత విద్యుత్‌, రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 7లక్షలు.. గిట్టుబాటు, మద్దతు ధరలు రావాలంటే.. మళ్లీ సంక్షేమ రాజ్యం కావాలంటే.. జగన్‌ అధికారంలోకి రావాలి​. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల చంటిబాబును, ఎంపీ అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు