జగన్‌ మాట తప్పడు.. ఆశీర్వదించండి

28 Jan, 2018 20:35 IST|Sakshi

‘సాక్షి’ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి 

ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన తల్లి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తన తండ్రిలాగే ప్రజల కోసం మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న తపన జగన్‌లో ఉందన్నారు. ఇచ్చిన మాట తప్పే మనిషి కాదని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తాము కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టించారని చెప్పారు. మూడు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసిన వైఎస్సార్‌ కుమారుడిపై కేసులు పెట్టడం బాధ కలిగించిందని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని జగన్‌ ఏనాడూ కోరుకోలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు జనం కోసం ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వైఎస్సార్‌ పాలన చూశారు కనుక జగన్‌ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. విజయమ్మ ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...      
– సాక్షి, హైదరాబాద్‌ 

అప్పుడే తొమ్మిదేళ్లు అయిపోయాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు? వీటిని తలచుకుంటే ఏమనిపిస్తోంది? 
విజయమ్మ: రాజశేఖరరెడ్డి పోవడమే మాకు పెద్ద షాక్‌. ఆయన దాదాపు 35 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేశారు. మరణించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వారికి రాజశేఖరరెడ్డి నచ్చలేదు. జగన్‌ నచ్చలేదు. ఆయన ద్వారా పైకి వచ్చినవారు, సహచరులు, ఆయనతో చాలా దగ్గరగా ఉన్న వారు ఎవరూ ఈ కుటుంబ పక్షంగా నిలబడకపోవడం చాలా బాధగా అనిపించింది. అన్యాయంగా కేసులు పెట్టి జగన్‌ను వేధించారు. జైలులో పెట్టించారు. ఎన్నో ఇబ్బందులను ఈ కుటుంబం ఎదుర్కొంది. అయినా జగన్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని జగన్‌ ఎప్పుడూ అనుకోలేదు. పొమ్మనలేక పొగబెడతారన్నట్లుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాడు. ఓదార్పు యాత్రకు అనుమతి తప్ప మరేమీ అడగలేదు. అందరూ మాతో బాగానే ఉండేవారు. కానీ సోనియా గాంధీకి, కేంద్రంలోని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. సంతకాలు జగనే పెట్టించాడన్నట్లుగా ఆమెకు రిపోర్టులు పంపించినట్లు ఉన్నారు. ఆమె దాన్నే చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. 

ఒక్క విషయంలో రాజీపడి ఉంటే మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు కదా
విజయమ్మ: ఓదార్పు యాత్రను మధ్యలో ఆపేశారు. రాజశేఖరరెడ్డికి అంత మంచి పేరు ఉందని కాంగ్రెస్‌ వారు కూడా ఊహించలేదనుకుంటా. ఒక జిల్లాలో యాత్ర చేయడానికి అనుమతించారు. ఆ జిల్లాలో ప్రజలు రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమనంతా జగన్‌పై చూపించారు. ఇది కాంగ్రెస్‌ వారికి నచ్చలేదనుకుంటా. అందుకే ఓదార్పు యాత్ర వద్దని ఆపించారు. తర్వాత మేం పరిస్థితులను వివరించడానికి అవకాశం ఇవ్వడంటూ సోనియా గాంధీకి లేఖ రాశాం. ఐదు వారాల తర్వాత సోనియాగాంధీ పిలిచారు. దీంతో నేను, షర్మిళ, జగన్, భారతమ్మ కలిసి వెళ్లాం. ‘మీరు రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు. ఒకేచోటకు అందరినీ పిలవండి. ఒక విగ్రహమే పెట్టండి. అంతకు మించి తిరగొద్దు. ఇది పార్టీ నిర్ణయం’ అని సోనియా చెప్పారు. షర్మిళ కళ్లల్లో నీరు పెట్టుకుని అడిగారు. ‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక మరణించిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడమే సరైన పద్ధతి’ అని షర్మిళ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఒకచోటకు పిలవాలనడం మాకు నచ్చలేదు. అందుకే ఇచ్చిన మాట మేరకు జగన్‌ ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని నిర్ణయించుకుని బయటకు వచ్చారు. ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. యాత్రకు వెళ్లొద్దు, సహకరించొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కట్టడి చేశారు. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. 

పార్టీ నుంచి బయటకు వెళితే ఇబ్బంది పడాల్సి వస్తుందని కేవీపీ లాంటి వారు చెప్పారట కదా?
విజయమ్మ:  చెప్పారు. వీరందరూ చెప్పారు. ఈ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని చేస్తారు, బయటకు వెళ్లవద్దని చెప్పారు. అయితే పార్టీ నుంచి జగన్‌ బయటకు వెళ్లక తప్పని పరిస్థితి సృష్టించారు. కడప జిల్లాకే పరిమితం చేశారు. మా ఇంట్లో తన నుంచి చిన్నాన్నను విడదీసేందుకు జరిగిన కుట్ర జగన్‌కు నచ్చలేదు. ఇక ఆ పార్టీలో మనం మన్నన పొందలేమమ్మా, బయటకు వెళ్లిపోదామని అన్నాడు.  

కొత్త పార్టీ పెట్టడానికి మీరు అంగీకరించారా?
విజయమ్మ: ఆ సమయంలో అదే సమంజసం అనిపించింది. 

జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తుండడం మీకు ఎట్లా అనిపిస్తోంది?
విజయమ్మ: ఈ కుటుంబంలో నేను ముగ్గురి (వైఎస్సార్, షర్మిళ, జగన్‌) పాదయాత్రలు చూశా. అందరిదీ ఒకే లక్ష్యం. వాళ్ల నాన్న లాగా ప్రజలతో ఉండాలని, వారికి మేలు చేయాలనే తపన జగన్‌లో చాలా ఎక్కువగా ఉంది. అతడు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇదే కారణం. ప్రజలు తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నప్పుడు జగన్‌ భరోసా ఇస్తున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. 

మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో... అని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారు కదా! 
విజయమ్మ: ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్‌ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, ఇంట్లో అందరితో సంతోషంగా ఉండటమే తెలుసు. 

చంద్రబాబు విమర్శించినప్పుడు మీకు ఎలా అనిపించేది?
విజయమ్మ: అసెంబ్లీలో జగన్‌ను మంత్రులు రెచ్చగొట్టినప్పుడు, కొందరు నేతలు జగన్‌ గురించి ఏదేదో మాట్లాడినప్పుడు, అసత్య ఆరోపణలు చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చేవి. చాలా బాధ కలిగేది. జగన్‌ మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాళ్లు అలా అనకుండా ఇంకేమంటారమ్మా.. అంటూ నన్ను సముదాయించేవాడు. 

ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూస్తే మీకేమనిపిస్తోంది?
విజయమ్మ: జగన్‌ పాదయాత్రకు లక్షలాది మంది వస్తున్నారు. నా దృష్టిలో ఎన్ని కిలోమీటర్లు నడిచారనేది పెద్ద ప్రాతిపదిక కాదు. మనం ఎన్ని లక్షల మందిని కలిశాం? ఎంతమందికి విశ్వాసం కల్పించాం? ఎంతమందికి ధైర్యం కల్పించగలుగుతున్నామనే అంశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 25 ఏళ్లు పట్టింది. అన్ని రోజులూ జనం ఆయనను నాయకుడిగా నమ్మారు. ఆయనపై అభిమానం చూపారు. ప్రజలకు తాను రుణపడి ఉన్నానని రాజశేఖరరెడ్డి అనుకునేవారు. ఈ రోజు ఆ జనం కోసం నా బిడ్డ నిలబడుతున్నాడని తలచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. 

ఎమ్మెల్యేలతో జగన్‌ సంతకాలు పెట్టించాడన్న అపవాదు చాలా తప్పు. రాజశేఖరరెడ్డి మరణంతో మేము షాక్‌లో ఉన్నాం. సంతకాలు పెట్టించిన సంగతి కూడా జగన్‌కు తెలియదు. సీఎం కావాలని జగన్‌ అనుకోలేదు. కాబట్టే రోశయ్య గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఒప్పుకున్నారు. రఘువీరారెడ్డి, మరికొందరు వచ్చి ఒప్పుకోవద్దని చెప్పారు. 

జగన్‌ భవిష్యత్తు, వైఎస్సార్‌సీపీ భవితవ్యంపై మీరేమనుకుంటున్నారు? 
విజయమ్మ: ప్రజలు విజ్ఞులు. వారికి అన్నీ తెలుసు. ఈ రోజు వారి కష్టాలను జగన్‌ వింటున్నాడు. అవి తీరుస్తానంటున్నారు. జగన్‌ కూడా తండ్రిలా మంచి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మడం లేదు. వైఎస్‌ కుటుంబం ఒక మాట ఇస్తే చేస్తుందని ప్రజలు నమ్ముతారనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. రాజశేఖరరెడ్డి రక్తం కాబట్టి జగన్‌ చెప్పింది కచ్చితంగా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందువల్ల తప్పకుండా జగన్‌ ప్రభుత్వం వస్తుందని, వాళ్ల తండ్రి చేసిన పనులను తప్పకుండా చేస్తారని నమ్ముతున్నా. 

జగన్‌ పాదయాత్రలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? సలహాలేవైనా ఇచ్చారా? 
విజయమ్మ: వాళ్ల నాన్న చనిపోయినప్పటి నుంచి జగన్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడ బాధల్లో ఉన్నా నేనున్నానంటూ వెళ్లడం జగన్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం. అతడికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. 

జగన్‌పై కేసులు పెట్టినప్పుడు తల్లిగా మీరు ఎలా ఫీలయ్యారు?
విజయమ్మ: చాలా బాధ కలిగింది. వైఎస్‌ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు సేవ చేశారు. ఆయన తన పేరు ఎక్కడా వాడుకోలేదు. ఎక్కడైనా కార్యకర్తలు రాజశేఖరరెడ్డి జిందాబాద్‌ అంటే రాజీవ్‌ గాంధీ జిందాబాద్‌ అనాలని సూచించేవారు. అంత సేవ చేసిన నాయకుడి కుమారుడిపై కేసులు పెట్టడం బాధ అనిపించింది. 

జగన్‌పై పెట్టిన కేసుల్లో పస ఉందనుకుంటున్నారా? 
విజయమ్మ: కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం రాజశేఖరరెడ్డి, జగన్‌ మంచివాళ్లు. పార్టీ పెట్టాలని నిర్ణయించడంతోనే కాంగ్రెస్‌ వారికి చెడ్డవాళ్లయిపోయారు. అలా అనుకున్న వారంలోనే నోటీసులు వచ్చాయి, ఆ వెంటనే కేసులు పెట్టారు. ఈ రోజు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆధారాలున్నా ఏమీ చేయడం లేదు. కానీ ఆ రోజు కోర్టుకెవరో లేఖ రాస్తే దాన్ని సీరియస్‌గా తీసుకొని ఈ కేసులన్నీ నడిపించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి కేసులు పెట్టాయి. 

ఇలాంటి సమయంలో రాజకీయాలెందుకని బాధపడ్డారా? 
విజయమ్మ: చాలా బాధపడ్డాను. జగన్‌కు కూడా చెప్పాను. వాళ్లకు వ్యతిరేకంగా వెళ్తే కష్టపడతావని అన్నాను. అలా అంటే న్యాయం, ధర్మం అనేవాడు. అబద్ధం చెప్పడం జగన్‌కు రాదు. న్యాయంగా వెళ్తూ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అన్నిటికీ దేవుడున్నాడనేది అతడి నమ్మకం. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదంటాడు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. జగన్‌ మాట తప్పే మనిషికాదు. ఒక తల్లిగా అతడి వ్యక్తిత్వం నాకు తెలుసు. మాట ఇస్తే పూర్తిగా కట్టుబడి ఉంటాడు. జగన్‌ను ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశమివ్వండి. జగన్‌ అన్నీ చేస్తాడని మాట ఇస్తున్నా.  జగన్‌కు జీవితమే అన్నీ నేర్పిస్తోంది. ఎక్కడ బస్సు, రైలు ప్రమాదం జరిగినా, వరదలొచ్చి ఎవరైనా చనిపోయినా వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చుతాడు. ప్రయాణాల్లోనే గడుపుతున్నాడు. ఇంట్లో ఉండేది ఎప్పుడని అడిగితే, మన బాధ్యత మనం నెరవేర్చాలి కదమ్మా అంటుంటాడు.  వైఎస్సారే మనకు ఆదర్శం. ఆయన ఏనాడూ అబద్ధం ఆడలేదు. ఆయన చెప్పినవి చేశారు. చెప్పనివీ చేశారు. ప్రజల్లో నమ్మకం కలిగించి వెళ్లారు. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఊహించారా? 
విజయమ్మ: ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ను చిన్న వయసులోనే పీసీసీ అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్‌ నుంచి పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోయారు. అప్పుడు చిన్న వాడిని పీసీసీ అధ్యక్షుడిని చేసినందుకు పెద్ద వారికి కోపం వచ్చింది. సహాయ నిరాకరణ చేశారు. చిన్న మీటింగ్‌ పెట్టాలన్నా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీని పటిష్టం చేశారు. ‘రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్‌ అంటే రాజశేఖరరెడ్డి’ అనే స్థితికి పార్టీని తీసుకొచ్చారు. పదేళ్ల ముందే రాజశేఖరరెడ్డి సీఎం అవుతారనే ప్రచారం సాగింది. రాజకీయాలపై నాకు అంతగా ఆసక్తి లేదు. సీఎం అయ్యాక ఆయన ఇంటికి వచ్చినా మా అందరితో సరదాగా గడిపే వారు తప్ప రాజకీయాల గురించి చెప్పేవారు కాదు. 

వైఎస్‌ చేసిన పనుల్లో మీకు బాగా నచ్చినవి?
విజయమ్మ: రాజశేఖరరెడ్డిగారు చేసినవన్నీ మంచి పనులే. ఇప్పుడున్న వాళ్లు రాజశేఖరరెడ్డి పెట్టారని ఏ పథకం తీసేయాలన్నా తీయలేనివే. ఆయన ఎంతో ఆలోచన చేసి పథకాలను ప్రవేశపెట్టారు. ఇంకా ఏం చేయాలా? అని ఎప్పుడూ తపన పడేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారంటే అవన్నీ రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. చంద్రబాబు ఆరోగ్యశ్రీని తీసేయగలరా? ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను తీసేయగలరా?  రాజశేఖరరెడ్డి పేరు లేకుండా చేయాలని వాళ్లకు ఉన్నా అలా చేయలేనివి ఆయన పథకాలు.  

అప్పుడు వాతావరణం బాగోలేకపోయినా రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారు. అధికారులు వద్దన్నారా? అధికారులు వద్దన్నా ఈయన వెళ్లారా? అసలేం జరిగింది? 
విజయమ్మ: ఆ రోజు నేను కూడా చెప్పా. వర్షం పడుతోంది, అసెంబ్లీ కూడా అయిపోయింది, ఇప్పుడు వెళ్లకుంటే ఏమవుతుంది? అన్నా. చాలా పనులున్నాయన్నారు. త్వరగా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రాష్ట్రానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి అని తపన పడేవారు. మూడేళ్లలో పోలవరం, ప్రాణహిత సహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామనేవారు. సోనియా గాంధీని కూడా వీటి గురించి అడిగి వచ్చారు. 33 మంది ఎంపీలను గెలిపించి తీసుకొస్తానంటే ఆమెకు నమ్మకం కలగలేదు. పదో, పన్నెండు మందో గెలుస్తారనుకున్నారు. వైఎస్‌ ఒక్కటే చెప్పారు. ఎన్నికలు అయిపోయాక డిసైడ్‌ చేయండమ్మా, మీరు పది 12 సీట్లు అనుకుంటున్నారు, నేను 33 నుంచి 36 మంది ఎంపీలను తీసుకొస్తాను, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని అన్నారు. 

వైఎస్‌ మరణం ఒక కుట్ర అని ప్రచారం జరిగింది. హెలికాప్టర్‌ ప్రమాదమేని అనుకున్నారా? 
విజయమ్మ: నాకు కూడా ఏదో జరిగింది అన్న అనుమానం ఉండేది. జగన్‌ను చాలాసార్లు అడిగాను. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే తప్ప ఏం జరిగినా బయటకు రాదమ్మా, రెండు ప్రభుత్వాలు  దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి బయటకు వచ్చేది ఏమీ ఉండదు అని అన్నాడు. 

2014 ఎన్నికల్లో 41 మంది ఎంపీలను గెలిపించుకొచ్చి రాహూల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ నాన్న చెప్పిన మాటను తాను నెరవేరుస్తానన్నాడు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అవుతానని సోనియాగాంధీకి జగన్‌ చెప్పాడు. అప్పుడు పెద్దాయన చనిపోయారనే షాక్‌లోనే మేమున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఊహ కూడా మాకు లేదు.

ఎందుకొచ్చిన రాజకీయాలు, ఒకరోజు ఇంటి పట్టున అందరూ కలిసి ఉండే పరిస్థితి లేదు, నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిమీద కాలేసుకుని ఏసీ రూముల్లో ఉండొచ్చని, రాజకీయాలు మనకు వద్దని అప్పట్లోనే జగన్‌కు చెప్పాను. ‘మా నాన్న ఎంతోమంది హృదయాల్లో ఉన్నారు. మా నాన్న ఫొటో ఇంట్లో పెట్టుకునేవారు ఎందరో ఉన్నారు. నాకు అలాంటి జీవితమే ఇష్టమమ్మా’ అని జగన్‌ అన్నాడు. చిన్నప్పుడు జగన్‌ నన్ను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది పెట్టేవాడు కాదు. 

జగన్‌ కుమార్తె హర్షకు లండన్‌ స్కూల్‌లో సీటు వచ్చింది కదా, ఎలా ఫీలయ్యారు?
విజయమ్మ: ఆమె చాలా తెలివైనది. ఎక్కడైనా సీటు వస్తుంది. బాగా చదువుతుంది. సబ్జెక్టు పుస్తకాలే కాకుండా నాలెడ్జ్‌ పెరిగే ఇతర పుస్తకాలు కొన్ని వేలు చదివింది. 

మీ బాల్యం, చదువు గురించి చెబుతారా? 
విజయమ్మ: ఎనిమిదో తరగతి వరకు నేను తాడిపత్రి సమీపంలోని యాడికి దగ్గరి గ్రామంలో మా నాన్నమ్మ దగ్గర పెరిగాను. ఆ తర్వాత పులివెందులకు వచ్చాను. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డితో పెళ్లయ్యింది. 

2019 ఎన్నికల్లో మీరు, షర్మిల ప్రచారానికి వెళ్తారా? 
విజయమ్మ: 2014లో జగన్‌ లేని సమయంలో నేను, షర్మిల బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్న రాష్ట్రమే.. 13 జిల్లాలే కనుక అంత అవసరం ఉండకపోవచ్చు. అవసరమైతే వెళ్తాం. 

ఇంట్లో మీరు ఎలా వ్యవహరిస్తుంటారు?
విజయమ్మ: ఇంట్లో ఉదయం అందరం కలుస్తాం. జగన్‌ వచ్చినప్పుడు కలుస్తాం. పిల్లలతోసహా అందరం కలిసి మాట్లాడుకుంటాం. రాజశేఖరరెడ్డి ఈ అలవాటు మాకు చేశారు. 

మీ మనవళ్లకు రాజకీయాలపై ఆసక్తి ఉందా? 
విజయమ్మ: చిన్నపిల్లలు కదా? ఇంకా వాళ్లకేమీ తెలియదు. మా కోడలు భారతి నాతో సొంత కూతురిలాగే ఉంటుంది. వాళ్లంతా మాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు.  

ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని అనుకుంటున్నారు? 
విజయమ్మ: ఎన్ని సమస్యలున్నా దేవుడే అధిగమింపజేస్తాడని అనుకుంటాం. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మనిషికి దేవుడే ఇస్తాడు. జగన్‌కు ఆ ధైర్యం ఉంది. మనమెన్ని మాటలు మాట్లాడినా చివరకు దేవుడికి జవాబుదారీగా ఉండాలి. 

ప్రజలకు రాజశేఖరరెడ్డితో మర్చిపోలేని అనుబంధం ఏర్పడింది. జగన్‌ కూడా తండ్రిలాగే జనానికి ఇస్తున్న భరోసా, ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. అయితే తీవ్రంగా కష్టపడుతుండడం వల్ల జ్వరం వచ్చిందని, కాళ్లు బొబ్బలు వచ్చాయని తెలిసినప్పుడు మనసు కలుక్కుమంటోంది. 

చంద్రబాబు 1978లో గెలిచాక అప్పట్లో రాజశేఖరరెడ్డికి మిత్రుడట కదా? చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించడంలో రాజశేఖరరెడ్డి పాత్ర ఉందంటారు. నిజమేనా?  
విజయమ్మ: అప్పుడు ఎక్కడికి వెళ్లినా వాళ్లు కలిసి వెళ్లేవారు. కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు కలిసి ఉండేవారు. ఇంటికి కూడా బాగా వస్తుండేవారు. అంజయ్య గారితో పోట్లాడి మరీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించారు.  

రాజశేఖరరెడ్డి, చంద్రబాబు మధ్య తేడాను ఎట్లా పోల్చుతారు. 
విజయమ్మ: ఆయనకు, ఈయనకు పోలికే లేదు. నక్కకూ, నాగలోకానికున్నంత తేడా ఉంది. వైఎస్‌తో చంద్రబాబును పోల్చాల్సిన అవసరం కూడా లేదు.

చంద్రబాబు కాకుండా జగన్‌ సీఎం కావాలని ప్రజలు ఎందుకు కోరుకోవాలనుకుంటున్నారు? 
విజయమ్మ: ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి. మంచి పనులు చేస్తామనే వారికి కాకుండా వేరేవాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. మంచి చేస్తానంటున్న జగన్‌కే తప్పకుండా ఓటు వేస్తారు. వైఎస్‌ పాలన చూశారు కనుక జగన్‌ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో నాకు కనిపిస్తోంది. చంద్రబాబు దగ్గర అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలుంటే, మా దగ్గర ప్రజలున్నారు. వైఎస్‌ ఒక మాట చెప్పేవారు. ప్రజల్లో నిలబడి ఉంటే నాయకులు వాళ్లంతట వాళ్లే వస్తారనేవారు. 

జగన్‌ ఇలా రాజకీయాల్లోకి వస్తారని అనుకునేవారా? 
విజయమ్మ: 2009లో ఎంపీగా నిలబడాల్సి వచ్చినప్పుడు తాను నిలబడనని జగన్‌ చెప్పాడు. చిన్నాన్నతో పోటీ చేయించండని అన్నాడు. అలా మాట్లాడొద్దు, నా 30 ఏళ్ల అనుభవం నీకు ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతావు అని వైఎస్‌ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమని భావిస్తున్నారు? 
విజయమ్మ: విభజన వల్ల హైదరాబాద్‌ పోయింది కనుక ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ఏపీలో పరిశ్రమలు లేవు, ఆసుపత్రులు లేవు. ఏపీకి హైదరాబాద్‌ లాంటి రాజధాని రావాలంటే కష్టమే. మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉంది. ఇక చంద్రబాబు ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు. నాలుగేళ్లవుతోంది. చంద్రబాబు అసెంబ్లీ కట్టారా? హైకోర్టు కట్టారా? ఆయన ఎవరికి మేలు చేశారు? ఎంతమందికి మేలు చేశారు?  తన పేరు గుర్తుండిపోయేలా చంద్రబాబు ఒక్క పనైనా చేశారా? ఏదీ లేదు. ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారు. 

చంద్రబాబు కంటే జగన్‌ మేలు, ఆయనకు ఓటేయాలని ప్రజలకు ఎలా చెప్పగలుగుతారు? 
విజయమ్మ: గతంలో వైఎస్‌ ఎంపీల మీటింగ్‌లో చంద్రబాబుకు చెప్పారు. 2000వ సంవత్సరం కంటే ముందు ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు కేటాయిస్తారు, ప్రాజెక్టులు మొదలు పెట్టు అని బాబుకు సూచించారు. దేవుడు అవకాశం ఇచ్చి 14 ఏళ్ల అధికారంలో ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయనప్పుడు చరిత్రలో అలాంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చాలా డబ్బు ఖర్చు పెడతారంటున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి మీ పార్టీలో ఉందా? మీ పార్టీ నడుస్తున్న తీరుపై మీరేమంటారు?
విజయమ్మ: అనుభవం కొంతమేర ఉపయోగపడవచ్చేమో గానీ నాయకుడు కావాలనుకొనే వ్యక్తికి మానవత్వం చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతారు. అది జగన్‌లో ఉంది. చంద్రబాబులో లేదు. అనుభవం అంటున్నారు. దేనిలో చూపించారు. హైకోర్టు కట్టారా? అసెంబ్లీ కట్టారా? ఏం చేశారు? 

జగన్‌ను ప్రజలకు అప్పగించానని మీరంటున్నారు. ప్రజలు ఆయనను ఎట్లా చూస్తున్నారు? 
విజయమ్మ: ఓదార్పు యాత్రలో జగన్‌ను చూసేందుకు బయటకు రానివారు ఎవ్వరూ లేరు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడూ అంతే. ఎంతో ప్రేమ చూపించారు. వాళ్లకు ఈ కుటుంబం ఎంత రుణపడి ఉందో వారు కూడా అదే విధంగా ప్రేమను చూపిస్తున్నారు. నా బిడ్డ అందరికీ మంచి చేస్తాడు. 

చంద్రబాబుకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఇంతకు ముందు తొమ్మిదేళ్లు, ఇప్పుడు ఐదేళ్లు. చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడం లేదెందుకో అర్థం కావడం లేదు. రాజశేఖరెడ్డి ఏం చేశారు, ఆయన పోయాక కూడా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారన్న ఆలోచన సైతం చంద్రబాబుకు కలగడం లేదు.  

మరిన్ని వార్తలు