శ్రీకాకుళానికి చంద్రబాబు చేసిందేమీ లేదు: విజయమ్మ

2 Apr, 2019 13:01 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ఈ జిల్లాకు చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు 2009లో తొమ్మిది సీట్లలో గెలిపించారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. జిల్లాలోని 34 ప్రభుత్వ పాఠశాలలను, 5 ఎస్సీ హాస్టల్స్‌ను చంద్రబాబు మూసివేశారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి చిన్న ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మత్య్సకారులను వైఎస్‌ జగన్‌ అన్ని రకాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిలా​ ఎచ్చెర్ల నియోజవర్గం జి సిగడాంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడకు వచ్చిన వారికి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రజలతో వైఎస్‌ కుటుంబానికి 40 ఏళ్ల అనుంబంధం..
ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సారి జరగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవి. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. మీ అందరికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. 30 ఏళ్ల​ పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. ప్రజలతో రాజశేఖరరెడ్డి గారి కటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. రాజశేఖరరెడ్డి గారి పాలన ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్సార్‌, షర్మిల, జగన్‌ పాదయాత్రలు ఇదే జిల్లాలో ముగిశాయి. 

వైఎస్సార్‌ను ఎంతగానో ప్రేమించే మీకు వచ్చిన కష్టం చూస్తే బాధ కలుగుతుంది. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపడితే మీరు అక్కున చేర్చుకున్నారు. అది నచ్చని టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రల చేసి వైఎస్‌ జగన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వైఎస్‌ జగన్‌ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఓదార్పు యాత్రతో నా బిడ్డను ప్రజల చేతుల్లో పెట్టాను. రాజశేఖరరెడ్డిగారు ఇచ్చిన కుటుంబం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్‌ పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఢిలీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్‌ గర్వంగా చెప్తారు. మేము ఏదైనా జవాబు చెప్పాలంటే అది ప్రజలకు మాత్రమే. ఈ రోజు ఎవరెన్ని ప్రశ్నలు వేసినా మీకు మాకు అనుబంధాన్ని ఎవరు వేరు చేయలేరు. మీ ఆశీర్వాదం, ప్రార్థనలు జగన్‌ను గండం నుంచి తప్పించాయి. మా కుటుంబం మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డిలాగానే జగన్‌ కూడా మీకు అన్ని పనులు చేస్తారు. రాజన్న భార్యగా మీకు నేను మాటిస్తున్నాను. రాష్ట్రం ముక్కలై.. ఏమి లేకుండా మిగిలిపోయాం. అలాంటింది చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రభుత్వ సందను అమ్ముకుని తింటున్నారు. రాజధాని భూములు, విశాఖలో భూములు, దళితుల భూములు దోచుకుంటున్నారు. ప్రజలను మేల్కొమని కోరుతున్నా. 

జిల్లాకు చంద్రబాబు చేసిందేమి లేదు..
ఈ జిల్లాకు వంశధార ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్‌, రిమ్స్‌ హాస్పిటల్‌, అంబేడ్కర్‌ యూనివర్సిటీలను వైఎస్సార్‌ తీసుకువచ్చారు. వంశధారకు 900 కోట్లు మంజూరు చేసిన వైఎస్సార్‌ 70 శాతం పనులు పూర్తి చేశారు. 2.74లక్షల ఇళ్లు ఈ ఒక్క జిల్లాలోనే కట్టించారు. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారు?. ప్రాజెక్టులు ఒక్క అంగుళం కదలేదు. అంబేడ్కర్‌ యూనివర్సిటీని నాశనం చేశారు. 34 ప్రభుత్వ పాఠశాలలను, 5 ఎస్సీ హాస్టల్స్‌ను మూసివేశారు. ఇలా అయితే పేద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు?. కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సిన ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలను మూసివేస్తుంది. స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కలిపించడం లేదు. శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీ కట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చేనేత పరిశ్రమకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు. చంద్రబాబు పాలనలో జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి లేదు. వలస పోయిన 22 మంది మత్య్సకారులను పాకిస్తాన్‌ వారు అరెస్ట్‌ చేస్తే ఐదు నెలలు గడిచిన వారిని విడిపించలేని ముఖ్యమంత్రి మనకు ఎందుకు?. 

ప్రభుత్వ పథకాలన్ని టీడీపీ వారికే ఇస్తున్నారు. పరిశ్రమల కాలుష్యం పెరిగిపోగవడంతో మత్య్సకారులు ఉపాధి దెబ్బతింటుంది. మత్య్సకారులను ఎస్టీల్లో చేర్చలేదు. ఇక్కడ ఉన్న టీడీపీ మంత్రి ఏమైనా అభివృద్ధి చేశారా?. నారాయణపురం ఆనకట్ట, ప్రభుత్వ కాలేజ్‌, ఈఎస్‌ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటైనా చేపట్టారా?. నీరు చెట్టు పథకం కింద దోపిడికి పాల్పడ్డారు. పరిశ్రమల పేరిట చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. ప్రభుత్వ భూములు తమవిగా చూపించి కళా వెంకట్రావు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేశారు. 

మత్య్సకారులను అన్నివిధాలా ఆదుకుంటాం..
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకుందాం. వ్యవసాయాన్ని పండుగగా చేసుకుందాం. మత్య్సకారులకు జెట్టిలు ఇస్తాం. జగన్‌ చెప్పినట్టు వేటకు వెళ్లలేని సమయంలో మత్స్యకారులకు పది వేల రూపాయలు అందజేస్తారు. చనిపోయిన మత్య్సకారుడి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం 4వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వలసలకు పోయిన వారు సైతం తిరిగి వచ్చేలా ఇక్కడ పాలన చేసకుందాం. నవరత్నాలతో వైఎస్‌ జగన్‌ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఆనాడు వైఎస్సార్‌ చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకున్నారు. వ్యవసాయానికి ఖర్చు దండుగా అన్న చంద్రబాబును చూశాం. చనిపోయిన రైతుల కుటంబాలకు పరిహారం ఇస్తే మరణాలు పెరుగుతాయని ఆనాడు చంద్రబాబు ఎగతాళి చేశారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టును.. తన బినామీలకు లాభం చేకూర్చేందుకు చంద్రబాబు తీసుకున్నారు. పోలవరం పేరుతో రోజుకో డ్రామా ఆడుతారు.

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్‌కుమార్, ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్‌ను అత్యధిక మోజారిటీతో గెలిపించండి. జిల్లాలో పదికి పది సీట్లలో వైఎస్సార్‌సీపీని గెలిపించాల’ని కోరారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు