చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు : విజయమ్మ

31 Mar, 2019 13:50 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. చంద్రబాబు మాయమాటలు, తీపి మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగుల ఇలా ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్‌ విజయమ్మ కోరారు.  వైఎస్సార్‌సీపీ ప్రజల కోసమే పుట్టిందని.. ఇది అందరి పార్టీ అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్‌ జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో జరిగిన ప్రచారసభలో ఆదివారం విజయమ్మ ప్రసంగించారు. ఆమె ఏం మాట్లాడారంటే..

ఒక్క హామీ అయిన నేరవేర్చారా?
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్క హామి అయినా నెరవేర్చారా? ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. తెరిచారా? డ్వాక్రా అక్క చెల్లమ్మలకు రుణమాఫీ జరిగిందా? రెండు రూపాయలకే ఇరవైలీటర్‌ నీళ్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? బ్రాందీ షాపులు రద్దు చేస్తామన్నారు. రద్దు చేసారా? నీళ్లు ఇవ్వడం లేదు గాని మద్యం మాత్రం అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికి రెండువేల రూపాయిలు నిరుద్యోగ భృతి ఇస్తా మన్నారు. ఇచ్చారా? బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. ఒక్కటైనా వచ్చిందా?  వీటిపై ప్రజలు ఆలోచన చేయాలి.

వైఎస్సార్‌ పాలన ఒక్కసారి గుర్తుచేసుకోండి..
ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104,  పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నా. రైతే రాజుగా చేశాడు. మళ్లీ జగన్‌ బాబు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుంది.  9 ఏళ్లుగా జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను భారీ మెజారిటీతో గెలిపించండి’  అని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు