హత్య చేస్తుంటే ఎవరైనా లెటర్‌ రాస్తారా?

16 Mar, 2019 17:35 IST|Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ : తన చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుంటే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ శనివారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్‌ నరసింహన్‌కు వైఎస్ జగన్‌ ఫిర్యాదు చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘నిన్న అత్యంత దారుణంగా జరిగిన చిన్నాన్న హత్య అంశం మీద న్యాయం జరగాలంటే, అది సీబీఐ విచారణ ద్వారానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు రిపోర్టు చేసే అధికారుల చేత విచారణ చేయిస్తే మాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని గవర్నర్‌కు వివరించడం జరిగింది. నిన్న పులివెందులలో మేము ఎస్పీతో మాట్లాడుతూ ఉండగానే, అడిషనల్‌ డీజీ ఇంటెలిజెన్స్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్‌ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసును ఆయన ఎంత లోతుగామానిటర్‌ చేస్తున్నారనే దానికి నిదర్శం. ఈ హత్య కేసులో అడిషనల్‌ డీజీ పాత్ర ఉంది. పోలీస్‌ వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారింది. చంద్రబాబు మా ఎమ్మెల్యేలను 20, 30 కోట్లతో ప్రలోభాలకు గురిచేస్తే... అం‍తకు ముందు వాళ్లతో... ఇదే వెంకటేశ్వరరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ మాట్లాడి డబ్బులిచ్చి, టీడీపీ కండువాలు కప్పారు. 

టీడీపీకి వాచ్‌మెన్ డిపార్ట్‌మెంట్‌గా..
ఇదే వెంకటేశ్వరరావుగారు టీడీపీకి వాచ్‌మెన్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారు. అటువంటి వెంకటేశ్వరరావు గారు... మా పార్టీ నుంచి వెళ్లిన 23 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఉన్నారు. గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఇంటెలిజెన్స్‌ నివేదికను చంద్రబాబుకు ఇస్తారు.ఇంటెలిజెన్స్‌ వ్యవస్థే ఇలా ఉంటే మాకు ఎలా న్యాయం జరుగుతుంది. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా ఉండటమే చిన్నాన్న చేసిన తప్పా?. ఆయనకు సెక్యూరిటీ కూడా తీసివేశారు. చంద్రబాబు మాటలు దొంగే దొంగా..దొంగా అన్నట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్లే హత‍్య చేస్తారు...వాళ్లే హంతకుడు అంటున్నారు. మళ్లీ మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పైన దేవుడు ఉన్నాడు...
చనిపోయిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి సోదరుడు, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. మా దగ్గర ఎమ్మెల్యే...పార్టీ ఫిరాయించి మళ్లీ మా మీద దాడులు చేస్తారు. మా అభ్యర్థి సుధీర్‌ రెడ్డికి మద్దతుగా చిన్నాన్న ప్రచారం చేస్తున్నారు. చిన్నాన్న సౌమ్యుడు, సెక్యూరిటీ కూడా లేదు. ఎక్కడికైనా ఒక్కడే వెళతాడు. అలాంటి మంచి వ్యక్తిని ...ఇంత దారుణంగా హతమార్చారు. పైన దేవుడు ఉన్నాడు... ఎప్పుడైనా కూడా రాక్షసత్వం పెరిగిపోయినప్పుడు పైవాడు చూసుకుంటాడు. ఇక మా నాన్నకు కట్టడి చేయడం కోసం మా తాతను చంపారు. తాతను చంపిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తావని చంద్రబాబు సవాల్‌ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయ్యారు. నన్ను కూడా ఎయిర్‌పోర్టులో చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల సమయంలోనూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

న్యాయం జరక్కపోతే కోర్టుకు వెళతాం..
చంద్రబాబు తప్పు చేయకపోతే ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు. ఓట్లను తొలగించడంతో పాటు, మనుషుల్ని కూడా తొలగిస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న డీజీపీ,
ఇంటెలిజెన్స్‌, ఏడీజీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఇలాంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు. ఆ అధికారులను తప్పిస్తేనే న్యాయం జరుగుతుందని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ
చిన్నాన్న హత్యకేసును సీబీఐ విచారణకు ఒప్పుకోకపోతే మేము కోర్టుకు కూడా వెళతాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి.

ఎస్పీని ఎందుకు మార్చాల్సి వచ్చింది..
ఎన్నికల జరగడానికి 40 రోజుల ముందు జిల్లా ఎస్పీని ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఘటనా స్థలంలో దొరికిందంటూ నిన్న ఎస్పీ ఒక లెటర్‌ చూపించారు. చిన్నాన్న లెటర్‌ రాశారంట...నా డ్రైవర్‌ నన్ను కొట్టి చంపారని... అసలు ఆ లెటర్‌ను ఎలా సృష్టించారు. చిన్నాన్నను బెడ్‌రూమ్‌లో కొట్టి ఆ తర్వాత...బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారు. దుండగులు చంపుతూ ఉంటే...చిన్నాన్న ఎలా లెటర్‌ రాసారు. ఇదంతా కుట్రను తెలపడం కాదా?. వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నాన్న హత్య ఉదంతంపై కొత్త కొత్త కథలు అల్లుతున్నారు. ఎన్ని కథలు చెప్పినా...నేను ఒకటే అడుగుతున్నాను. చిన్నాన్న ఎలా చనిపోయారు. నా ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈ హత్యకేసులో ఆయన ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి. అని ప్రశ్నలు సంధించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా