బళ్లారి ఆత్మీయుడు వివేకా

16 Mar, 2019 13:12 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డితో బళ్లారిలో ఆయన స్నేహితులు మాటామంతి (ఫైల్‌)

అన్నయ్య వైఎస్సార్‌తో కలిసి ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం

ఇప్పటికీ ఎందరో స్నేహితులు  

వారం కిందటే బళ్లారి సందర్శించిన వివేకానందరెడ్డి  

మరణవార్తతో స్నేహితుల విషాదం

అత్యంత సౌమ్యుడు, వినయశీలి, నిరాడంబరుడు, అందరికీ ఆత్మీయుడు.. ఇలా ఎన్నో సుగుణాలు కలబోసిన వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక లేరు అన్న విషాద వార్తతో బళ్లారిలోని ఆయన మిత్రులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవల వచ్చి కలిశారు, పాత మధురాలను తల్చుకుని మురిసిపోయాం, అంతలోనే ఇంత ఘోరం ఎలా జరిగిందని ఆవేదన చెందుతున్నారు.   

సాక్షి, బళ్లారి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆకస్మికంగా కన్నుమూయడం బళ్లారిలోని సన్నిహితుల్ని, స్నేహితుల్ని తీరని విషాదానికి గురిచేసింది.  

అన్నయ్యతో కలిసి పాఠశాలకు  
వివేకా అన్నయ్య వైఎస్సార్‌తో కలిసి బళ్లారిలో విద్యాభ్యాసం చేసేటప్పుడు నగరంలోని విడదీయని బంధం ఏర్పడింది. తండ్రి దివంగత వైఎస్‌ రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పనిచేసేటప్పుడు బళ్లారిలోనే కొంతకాలం కుటుంబం నివసించింది. వైఎస్‌ రాజారెడ్డి అప్పట్లో తన కుమారులైన జార్జిరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, కుమార్తె విమలను బళ్లారిలోనే చదివించారు. మహానేత రాజశేఖరరెడ్డితో కలిసి 1959 సంవత్సరంలో బళ్లారిలోని కోట ప్రాంతంలోని సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో  చేరారు. అప్పట్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకే ఉండటంతో అంతవరకు బళ్లారిలోనే చదివారు. కోట ప్రాంతం నుంచి అన్న వైఎస్సార్‌తో కలిసి కాలినడకన, సైకిల్‌పై పాఠశాలకు వచ్చేవారని తోటి స్నేహితులు గుర్తు చేసుకున్నారు. 


బళ్లారిలో వైఎస్‌ వివేకానందరెడ్డి చదివిన సెయింట్‌జాన్‌ పాఠశాల అండ్‌ కాలేజీ

వారం కిందటే సమాగమం  
వారం రోజుల కిందటే బళ్లారికి విచ్చేసిన వైఎస్‌ వివేకానందరెడ్డి ఆయన స్నేహితులు పవన్‌ హోటల్‌ యజమాని రాందాసరెడ్డి, సుధాకరరెడ్డి, రామకృష్ణ, విరుపాక్షప్పలను కలిసి ముచ్చటించడాన్ని వారు కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. గతంలో ఆయన బళ్లారిలో జీన్స్‌ ఫ్యాక్టరీలను సందర్శించి, బళ్లారి జీన్స్‌ తరహాలోనే పులివెందులలో కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావించారు. ఇంతలోనే ఆయన మరణవార్త వినాల్సి వస్తుందనుకోలేదని స్నేహితులు, క్లాస్‌మీట్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే హుటాహుటిన పలువురు పులివెందులకు వెళ్లారు. బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి కూడా పులివెందులకు వెళ్లారు. 


తరచూ బళ్లారికి రాక
బళ్లారిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదువుకున్న అనంతరం విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్‌ మీడియట్‌ పూర్తి చేసుకుని, మళ్లీ బళ్లారిలో వీరశైవ కళాశాలలో బీఎస్‌సీ చేరారు. కొద్దిరోజులకు తిరుపతిలో అగ్రికల్చరల్‌ బీఎస్‌సీ చేసినట్లు ఆయన స్నేహితులు తెలిపారు. బళ్లారిలో విద్యాభ్యాసం చేసేటప్పుడు వైఎస్‌ వివేకానందరెడ్డి స్నేహతులతో ఎంతో సఖ్యతతో, వినయంగా ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఆయన స్నేహితులను కలిసేందుకు ఏడాదిలో పలుమార్లు వచ్చేవారంటే ఆయనకు చిన్ననాటి స్నేహితులంటే ఎంత అభిమానమో అర్థమవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు