‘వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్‌ చేయూత’

4 Feb, 2020 15:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన పేద మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసహాయం అందిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని చెప్పారు. సాంకేతిక సమస్యలో లేక సమాచార లోపం వల్లనో ఎవరికైనా పెన్షన్‌ రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. సచివాయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బాబు నిరూపించాలి..?
7 లక్షల పెన్షన్లు తొలగించామని ఆరోపిస్తున్న చంద్రబాబు దానిని నిరూపించగలరా..? అని బొత్స ప్రశ్నించారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని అన్నారు. బాబు హయాంలో ఇచ్చిన పింఛన్ల కంటే 2 లక్షల పింఛన్లు అదనంగా ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా 6 లక్షలకు పైగా పింఛన్లు ఇస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు