ఓటర్ల నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి

26 Aug, 2018 03:39 IST|Sakshi

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ సందర్భంగా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ నేతలు ఓటర్ల నమోదు కార్యక్రమంలో క్రియాశీలంగా వ్యవహరించాలని కోరింది. అక్టోబరు 30 వరకూ సాగే ఈ ప్రక్రియ అత్యంత కీలకమైనదిగా భావించి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల మొదలు అసెంబ్లీ, లోక్‌సభ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ సూచించింది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రస్తుత నిబంధనల ప్రకారం 01.01.2019 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకోనున్న యువతీ యువకులందరూ ఓటు హక్కు పొందడానికి అర్హులేనని పార్టీ తెలియజేసింది. ఓటు సవరణలు, మార్పులు, తొలగింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ను జారీచేస్తూ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయ కోఆర్డినేటర్‌గా సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డిని నియమించినట్లు  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు