మీ అభ్యర్థి.. శ్రీదేవమ్మ!

25 Nov, 2017 18:12 IST|Sakshi

పత్తికొండ శాసనసభ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, కృష్ణగిరి (కర్నూలు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే అ‍భ్యర్థిని ప్రకటించారు. దివంగత చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్య శ్రీదేవమ్మను పత్తికొండ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీదేవమ్మను ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

నారాయణ రెడ్డి గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదని, ఎన్నికల్లో ఆయనకు ఎంత మెజారిటీ ఇచ్చేవారో అంతకు రెండింతల మెజారిటీ శ్రీదేవమ్మకు ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఖరారైన మొదటి అభ్యర్థి శ్రీదేవమ్మేనని ఈ సందర్భంగా జగన్‌ ప్రకటించారు. 2019 శాసనసభ ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థిగా  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ కూడా దక్కదని, ప్రజలు కసితో ఆ పార్టీని ఓడిస్తారని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అధికారంలో కొనసాగాలంటే.. ఎమ్మెల్యేలను కొనడం మాని.. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్‌ జగన్‌ సూచించారు. అధికారాన్ని కాపాడుకునే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాలను, ఎమ్మెల్యేల కొనుగోళ్లను పైన దేవుడు, ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఆయకట్టును స్థిరీకరిస్తా!
వైఎస్సార్‌ హయాంలో 80 శాతం పూర్తయిన కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్‌లను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లయినా మిగిలిపోయిన 20శాతం పనుల పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న చేతగాని ప్రభుత్వాన్ని సాగనంపుదామని వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తే.. గుండ్రేవుల ప్రాజెక్ట్‌ను తీసుకువస్తానని వైఎస్‌ జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలుగుగంగ, కేసీ కెనాల్‌కు ఆయకట్టు స్థిరీకరణ చేస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు