2న వంచనపై గర్జన దీక్ష

27 Jun, 2018 03:55 IST|Sakshi

అనంతలో నిర్వహిస్తామన్న వైఎస్సార్‌సీపీ

సాక్షి, హైదరాబాద్‌/అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అనంతపురంలోని టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూలై 2వ తేదీన ‘వంచనపై గర్జన దీక్ష’ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30న జరగాల్సిన ఈ దీక్షను వచ్చే నెల రెండుకు వాయిదా వేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగే ఈ దీక్షలో.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయి..
రాష్ట్ర ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీల తీరుకు నిరసనగా అనంతపురంలో చేపడుతున్న వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని.. మరి నాలుగేళ్లు కేంద్రంలో ఉండి ఏం చేశారని ఆయన నిలదీశారు.

పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కాజేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నా సీఎం ఎందుకు జవాబు చెప్పట్లేదని  ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్‌ వల్లే పోలవరాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నిజాన్ని ఇప్పటికైనా బాబు ఒప్పుకున్నారని.. అవినీతిపై తాము చేసిన ఆరోపణలను కూడా భవిష్యత్‌లో ఒప్పుకోక తప్పదన్నారు.

మరిన్ని వార్తలు