అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు డ్రామా

13 Mar, 2018 19:27 IST|Sakshi

బాబు యూటర్న్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ఫైర్‌

సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరోసారి డ్రామాలకు తెరతీశారని, ఆయన తీరును చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని ధ్వజమెత్తింది. ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు సర్కారు తాజాగా  అసెంబ్లీలో తీర్మానం చేయడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి స్పందించారు.

ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ..  గతంలో ప్రత్యేక ప్యాకేజీ బ్రాహ్మండమైన ప్యాకేజీ అని చంద్రబాబు పొగిడారని, అందరికంటే మనమే ఎక్కువ సాధించామంటూ బాబు గతంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను గమనించి..  చంద్రబాబు గజినీగా మారిపోయారని, ప్రజలు కూడా తనలాగే గజినీలు అవుతారని ఆయన పొరపడుతున్నారని కాకాని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి నీతి, నిజాయితీ లేవని, రెండునాల్కుల ధోరణి, రెండు కళ్ల ధోరణితో ఆయన రాజకీయ జీవితమంతా సాగిందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిందని, గత నాలుగేళ్లుగా హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపుతానని గతంలో హెచ్చరించిన చంద్రబాబు.. హోదాపై వైఎస్‌ జగన్‌ పోరాటాలకు ప్రజలు మద్దతు లభిస్తుండటంతో మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారని కాకాని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు