వైఎస్సార్‌ సీపీ ప్రజల పక్షం: సజ్జల

12 Mar, 2020 11:28 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ పోరాట పటిమతో ఎదిగిన పార్టీ..

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

సాక్షి, తాడేపల్లి: ఎన్నో పోరాటలు చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకుడిగా ఎదిగారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పార్టీ జెండాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనతో పాటు లక్ష్మీపార్వతి, ఎంవీఎస్‌ నాగిరెడ్డి కేక్‌ కట్‌ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు  పాల్గొన్నారు. (పదో వసంతంలోకి వైఎస్సార్‌ సీపీ, సీఎం జగన్‌ ట్వీట్‌)

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షమని తెలిపారు. ప్రజలతో మమేకమైన రాజకీయాలే తమకు తెలుసునని పేర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం పాటు పడుతున్నామని చెప్పారు. 

చంద్రబాబు డ్రామాలు..
టీడీపీని డ్రామాల పార్టీగా సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మండిపడ్డారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను మాచర్ల ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో అంబటి, మస్తఫాను హత్య చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సంయమనంతో వ్యవహరించామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. (విశాఖలో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ వేడుకలు)

ఒక ఉద్యమంలా మొదలై..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ ఒక ఉద్యమంలా మొదలై అధికారంలోకి వచ్చిందని సజ్జల తెలిపారు. 2009లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయన్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రంలో చీకటి అలుముకుందన్నారు. ఆయన మరణం తర్వాత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో లక్షల మంది పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి అడుగులు వేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ జగన్‌ 51 శాతం ఓట్లు సాధించారని తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలోనే ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని పేదలకు చేరుస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెట్టుకున్న ఆశలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని  సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు