లోక్‌సభ బరిలో అధిక సంఖ్యలో ఉన్నత విద్యావంతులు

13 May, 2019 11:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చదువుతో సంబంధం లేకుండా రాణించగలిగే రంగాలు కొన్ని ఉంటాయి. వాటిలో పాలిటిక్స్‌ ఒకటి. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల నమ్మకం, ఆదరాభిమానం ఉంటే సరిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస విద్యార్హత లేని వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటే ప్రజలకు మంచి పాలన ఏవిధంగా ఆందించగలడనే ప్రశ్నలు గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

ఈ క్రమంలో ఆంగ్ల మీడియా సంస్థ ఇండియా టుడే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల విద్యార్హతల గురించి ఓ సర్వే నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2019లో ఎన్నికల బరిలో నిలిచిన వారిలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 48 శాతం మంది మాత్రమే. అంటే బరిలో నిలిచిన వారిలో కనీసం సగం మంది అభ్యర్థులు కూడా డిగ్రీ పాస్‌ అయినవారు లేకపోవడం విచారకరం. దీన్ని కాసేపు పక్కన పెడితే.. అత్యధిక మంది ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపిన పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా 88 శాతం మంది డిగ్రీ లేదా అంతకన్నా పై చదువులు చదివిన విద్యావంతులు ఉన్నారు. ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపే అంశంలో ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా దక్షిణాదికి చెందిన పార్టీలే ముందంజలో ఉన్నాయి.

అభ్యర్థుల విద్యార్హతలను పార్టీల వారీగా చూసుకుంటే.. అత్యధికంగా 88 శాతం మంది డిగ్రీ లేదా ఆపై చదువులు చదివిన విద్యావంతులను బరిలోకి దింపిన పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ పరిశీలనలో ప్రథమస్థానంలో నిలిచింది. 86.4 శాతం మంది విద్యావంతులైన అభ్యర్థులతో ఏఐఏడీఎంకే, 82.4 శాతంతో టీఆర్‌ఎస్‌ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తమిళనాడుకు చెందిన నామ్‌ తమిళియార్‌ కచ్చి పార్టీ తరఫున లోకసభ బరిలో నిలిచిన వారిలో 80 శాతం డిగ్రీ ఉత్తీర్ణత సాధించివారు ఉన్నారు. ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే.. ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపిన పార్టీల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రథమ స్థానంలో ఉండగా.. అధికార బీజేపీ పార్టీ ఐదో స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌ సభ బరిలో నిలిచిన వారిలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు 75.7 శాతం కాగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ 74.5 శాతం, బిజు జనతా దళ్‌ 71.4 శాతం, ఆప్‌ 71.4 శాతం, బీజేపీ 70.8 శాతం ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపాయి. ఇక బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన వారిలో  కేవలం 52.5 శాతం  మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నత విద్యావంతులుండగా.. 38 శాతంతో స్వతంత్ర అభ్యర్థులు ఆఖరి స్థానంలో నిలిచారు. ఇక దేశవ్యాప్తంగా ఓ ఐదు నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన వారంతా ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. ఇవి శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్‌), బలంగీర్‌ (ఒడిషా), దక్షిణ గోవా (గోవా), నవరంగ్‌పూర్‌ (ఒడిషా), నాగలాండ్‌(నాగలాండ్‌).

ఇక మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన వారిలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే పీజీ చేయడం విశేషం. మిగతా అభ్యర్థుల్లో ఎక్కువ మంది 10 పాస్‌ అయిన వారే ఉండటం గమనార్హం. ఇక గుజరాత్‌కు చెందిన బరూచ్‌, సురేంద్రనగర్‌ 12, 13 శాతం మంది ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపినట్లుగా సదరు సర్వే వెల్లడించింది. బిహార్‌కు చెందిన దర్భంగా, ఒడిషాకు చెందిన సుందర్‌గఢ్‌, గుజరాత్‌కు చెందిన ఖేడా ఉన్నత విద్యావంతుల జాబితాలో చివరి స్థానంలో నిలిచాయి. ఇక బీజేపీ, బీఎస్పీకి చెందిన ఓ ఐదుగురు అభ్యర్థులు కేవలం ఐదవ తరగతి వరకూ మాత్రమే చదవడం గమనార్హం. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో కేవలం 2 శాతం మంది నిరాక్షరాస్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు