చంద్రబాబు నయవంచకుడు

3 Jun, 2018 01:57 IST|Sakshi
‘వంచనపై గర్జన’ దీక్ష సభలో ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి. చిత్రంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు

  హోదా రాకపోవడానికి మోదీ, బాబులే కారణం 

  నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ దగా 

  కాంగ్రెస్‌తో బాబు మిలాఖత్‌ 

  బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలి 

  వంచనపై గర్జనలో వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు 

నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా విషయంలో అడుగడుగునా రాష్ట్ర ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దిమ్మ తిరిగేలా వచ్చే ఎన్నికల్లో జవాబు చెప్పాలని నెల్లూరు నగరంలో శనివారం జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. అనుభవజ్ఞుడినని చెప్పుకుని అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. తనను మోదీ మోసం చేశారని మాయమాటలు చెబుతూ ముందుకు వస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరాదని గర్జన వేదికగా నేతలు కోరారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు మోసపూరిత విధానాలకు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో శనివారం రెండో విడతగా ‘వంచనపై గర్జన’ ఒక రోజు నిరాహారదీక్ష జరిగింది. ఈ దీక్షలో ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉ.9 గంటలకు నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన నేతల దీక్ష సా. 5గంటలకు ముగిసింది. నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసినప్పటికీ నేతలు తమ ప్రసంగాలను కొనసాగించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు కదలకుండా ప్రసంగాలను ఆలకించారు.  దీక్ష ప్రారంభం అయ్యేటప్పటికే వేదిక ప్రాంగణంలోకి పెద్ద సంఖ్యలో వచ్చిన జనం తమ నేతల దీక్షకు సంఘీభావం పలికారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను ఎండగట్టినపుడల్లా వారు హర్షధ్వానాలతో స్వాగతించారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
కాగా, చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలలోని డొల్లతనాన్ని నాయకులు ఎలుగెత్తి చాటారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణదొక్కాలని చూసిన చంద్రబాబు ఇపుడు హోదా కావాలని మాట మార్చడంపై ముందుగా క్షమాపణ చెప్పాలని వక్తలు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో హోదా బాట పట్టి దొంగదీక్షలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచీ ఏనాడూ చంద్రబాబు హోదా కావాలని కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదని.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచమని మాత్రమే ఎప్పుడూ కోరారన్నారు. హోదాను సమాధి చేయాలని చంద్రబాబు చూస్తే.. దానిని నాలుగేళ్లుగా సజీవంగా ఉంచింది జగన్‌ అని నేతలు పేర్కొన్నారు. 

ప్రత్యేక హోదా విషయంలోనూ.. విభజన చట్టంలోని హామీల అమలులోనూ మోసగాడు నెం 1 ప్రధాని మోదీ అయితే.. మోసగాడు నెంబర్‌ 2 చంద్రబాబు అని ఓ నేత అన్నప్పుడు దీక్షలో చప్పట్లు మార్మోగాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు బీజేపీతో సంబంధాలు అంటగట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవానికి మోదీతో పోరాటం అంటూనే లోపాయికారీగా లాలూచీ పడుతున్నది చంద్రబాబేనన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత తనపై కేంద్రం దాడిచేస్తుందని, అందరూ తనకు రక్షణగా నిలవాలని బెంబేలెత్తిపోయిన చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దాడి జరుగలేదంటే లోపాయికారీగా వారితో లాలూచీ పడినట్లు కాదా అని అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తొలుత విమర్శించిన బీజేపీ నేతలు ఆయనపై ఇంకా విచారణ ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని కొందరు డిమాండ్‌ చేశారు.

గత ఎన్నికల్లో సోనియాను ఇటలీ దయ్యం అన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె దేవత అయ్యిందా? అని కొందరు వ్యంగ్యోక్తులు విసిరారు. కర్ణాటకలో రాహుల్‌గాంధీ వీపుపై దువ్వారంటేనే ఆయన ఎంతటి కుటిలనీతిని ప్రదర్శిస్తున్నారో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయినట్లుగా ఉందని, పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను చిత్తుగా ఓడించవచ్చని వక్తలు పేర్కొన్నారు. బీజేపీ చేతిలో మోసపోయానంటున్న చంద్రబాబు తన నలభై ఏళ్ల అనుభవం ఎందుకు పనికొచ్చింది? అని వక్తలు సూటిగా ప్రశ్నించినపుడు దీక్షలో ఈలలు, చప్పట్లు మోగాయి. ప్రస్తుతం 20 మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని హోదా సాధించలేని చంద్రబాబు.. ఇప్పుడు తనకు 25 ఎంపీలను గెలిపించి ఇస్తే హోదా తెస్తాననడం ప్రజలను మోసం చేయడమేనని, ఆయన్ను నమ్మొద్దని నేతలందరూ ముక్తకంఠంతో ప్రజలను కోరారు. 
    
మోదీ, బాబు ‘జాయింట్‌ వంచన’: ఉమ్మారెడ్డి
మోదీ, చంద్రబాబు కలసి జాయింట్‌గా రాష్ట్ర ప్రజలను వంచనకు గురిచేశారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకురావడంలో బాబు విఫలమయ్యారన్నారు. నవనిర్మాణ దీక్షలకు జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.2.30 లక్షల కోట్ల అప్పులు చేసిన బాబు అమరావతి కోసం మరో రూ.2 వేల కోట్లు బాండ్ల రూపంలో దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

పెడచెవిన పెట్టారు: ఎంపీ వరప్రసాద్‌ 
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టారని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం 13 సార్లు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి హోదా రాకపోవటానికి కారణం 40 శాతం మోదీ అయితే, 60 శాతం బాబు అని విమర్శించారు.  

అన్ని వర్గాలకు అన్యాయం: మేరుగ 
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు.  బాబు కల్లబొల్లి మాటలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు నష్టపోయారన్నారు.  

హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌: పెద్దిరెడ్డి 
ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైఎస్‌ జగన్‌ గుర్తింపు తెచ్చుకున్నారని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపిస్తే నేడు ఆ పార్టీతో కలిసిపోయే విధంగా బాబు ప్రణాళిక రూపొందించారన్నారు. కాగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన సొంత ఊరు నారావారిపల్లిలో అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీడీపీ జెండాను మోస్తానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

కూకటివేళ్లతో పెకలించాలి: భూమన 
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ను కూకటివేళ్లతో పెకలించాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దగాకోరు మంత్రులతో రూ.3.50 లక్షల కోట్లు లూటీ చేసి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతుల పొలాలను, ప్రభుత్వ భూములను స్వాహా చేశారన్నారు. బాబు, మోదీల రహస్య ఒప్పందం మేరకే హోదా రాలేదన్నారు.  

జగన్‌ను చూసి 40ఏళ్ల అనుభవం భయపడుతోంది: పృథ్వీరాజ్‌ 
ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు నలభై ఏళ్ల అనుభవం ఉందని ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వ్యక్తి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం పదవులను త్యాగం చేసిన తమ ఐదుగురు ఎంపీలు హీరోలే అని పేర్కొన్నారు.   

మోదీ, బాబుల లాలూచీ: అంబటి 
బీజేపీ, టీడీపీలు బయట ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా లోపల మాత్రం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మధ్య లాలూచీలు జరుగుతూనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మోదీ తనను మోసం చేశారని చెబుతున్న బాబు.. 40ఏళ్ల అనుభవం ఉండి ఎలా మోసపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చీల్చింది బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలని, రానున్న రోజుల్లో వీటిని తరిమికొట్టాలని ప్రజలకు అంబటి పిలుపునిచ్చారు. 

నాలుగేళ్లుగా రెండు పార్టీల దగా: వైవీ 
పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దగా చేశాయన్నారు. కేంద్రం తీరని అన్యాయం చేసింది కాబట్టే తమ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబులు కలిసే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నాలుగేళ్లు వెన్ను పోటు పొడిచారన్నారు. 

హోదా ఇచ్చే వారికే మా మద్దతు: సజ్జల 
రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తారో వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని పేర్కొన్నారు.  

బాబు అనుభవంతో ఉపయోగంలేదు: ఎంపీ అవినాశ్‌ 
ప్రత్యేక హోదా రాకపోవడంలో మొదటి ముద్దాయి బీజేపీ అయితే రెండో ముద్దాయి టీడీపీ అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధ్యంకాదని అరుణ్‌జైట్లీ చెప్పినప్పుడు చంద్రబాబు ఎదురుతిరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పైగా ఆయనకు సన్మానం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన చంద్రబాబు ఏపీకి సాధించింది ఏమీలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎంపీలు విజయసాయిరెడ్డి అస్వస్థత కారణంగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విదేశాలకు వెళ్లినందున, వ్యక్తిగత పనులతో మిథున్‌రెడ్డి గర్జన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.   

ఉమ్మారెడ్డికి అస్వస్థత 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం అస్వస్థతకు గురయ్యారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌తో ఒక్కసారిగా నీరసించిపోయి కళ్లు తిరగడంతో హుటాహుటిన ఆయనను నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 

మరిన్ని వార్తలు