అభ్యర్థులు లేకే చంద్రబాబు డ్రామాలు

14 Mar, 2020 05:41 IST|Sakshi

నంది నుంచి ఆస్కార్‌ వరకు అన్ని అవార్డులూ ఆయనకే ఇవ్వొచ్చు :మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ దివాళా తీసింది : జోగి రమేష్‌

టీడీపీలో ఒక్కరూ మిగలరు : మంత్రి బాలినేని

ఆరు నెలల్లో టీడీపీ దుకాణం బంద్‌ : ఆమంచి కృష్ణమోహన్‌

సాక్షి, అమరావతి/తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ ఓటమి పాలు కావడం ఖాయమనే విషయం ముందే తెలిసిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ నెపాన్ని వైఎస్సార్‌ సీపీపై నెట్టివేసేందుకు చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు పెద్ద నటుడు 
విపక్ష నేత చంద్రబాబు  మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయన ఓ పెద్ద నటుడని అర్థమవుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క తంటాలు పడుతున్న చంద్రబాబు ఆ పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తుంటే తాము అడ్డుకుంటున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే అధికార పార్టీపై నెపం వేస్తున్నారని ఆరోపించారు. తెగ నటిస్తున్న చంద్రబాబుకు నంది అవార్డు నుంచి ఆస్కార్‌ వరకు అన్నీ ఇవ్వొచ్చన్నారు. ఇంకా ఏమన్నారంటే..
- 9 నెలల పాలనలో సుమారు కోటి కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని అందించాం.
- ఈ పథకాల వల్ల లబ్ధి పొందడంతో గత ఎన్నికల్లో మాకు ఓట్లు వేయనివారు కూడా ఈ సారి సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు పలుకుతున్నారు.
- చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం పోయి, టీడీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ఆయన తప్పుడు విమర్శలు చేస్తున్నారు. 
చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులే అరాచకాలు చేస్తున్నారు. గతంలో మా వారిని కనీసం కుప్పంలో నామినేషన్‌ కూడా వేయనీయలేదు. మేం ఎక్కడా ఎవరినీ అడ్డుకోవడం లేదు.

చాలా మంది టచ్‌లో ఉన్నారు 
ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద ఆ పార్టీ నేతలు విరక్తితో ఉన్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
- చాలా మంది టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీతో టచ్‌లో ఉన్నారు. 
- కానీ మేం సెలక్టివ్‌గా కొందరిని మాత్రమే తీసుకుంటున్నాం. అందర్నీ తీసుకునేటట్లు అయితే ఒక్కరు కూడా టీడీపీలో మిగలరు.
- చంద్రబాబు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తల విశ్వాసాన్ని కోల్పోయారు.

చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు
ఏపీలో టీడీపీ పూర్తిగా దివాలా తీసిందని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాటాడుతూ ఏమన్నారంటే..
- టీడీపీలో నామినేషన్‌ వేసే వారు, బీఫార్మ్‌ తీసుకునేవారు లేరు. 
- శాసనసభ ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా ఆయనకు బుద్ధి రాలేదు. 
- చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతలకు నమ్మకం పోయింది.
- జగన్‌ సంక్షేమ పాలన చూసే ఆ పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారు. 

టీడీపీ నేతలంతా క్యూ కడుతున్నారు
సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని, అందుకే టీడీపీ ముఖ్యనేతలందరూ వైఎస్సార్‌సీపీలోకి క్యూ కడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
- ఏడాదిలోపు టీడీపీ దుకాణం పూర్తిగా బంద్‌ కాబోతోంది.
- సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని పార్టీల వారూ స్వాగతిస్తున్నారు. 
- టీడీపీలో కొనసాగితే భవిష్యత్‌ ఉండదనే టీడీపీకి హార్డ్‌కోర్‌గా ఉన్న వారు సైతం వైఎస్సార్‌ సీపీకి చేరువ అవుతున్నారు.  

మరిన్ని వార్తలు