రాజకీయం కోసం ఇంత కిరాతకమా

16 Mar, 2019 04:50 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేతల మండిపాటు 

చంద్రబాబు, లోకేష్,ఆది ప్రమేయం ఉంది: విజయసాయి

సిట్‌తో వాస్తవాలు బయటకు రావు: వాసిరెడ్డి 

చంద్రబాబే సూత్రధారి: రాచమల్లు 

హత్య వెనక టీడీపీ పెద్దల హస్తం 
వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఆమె శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి మరణంతో పార్టీ మొత్తం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మంత్రి ఆదినారాయణరెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. ఆయన, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని తాము కోరితే, ‘సిట్‌’ వేశామని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల్లో వేసిన ‘సిట్‌’ దర్యాప్తులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌లా వ్యవహరించే దర్యాప్తు సంస్థలతో వాస్తవాలు బయటకువస్తాయనే నమ్మకం తమకు లేదని వాసిరెడ్డి పద్మ తేల్చిచెప్పారు.  

రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
‘‘కడప పార్లమెంట్‌ స్థానంలో గెలిచి తీరుతాం, పులివెందులలో ఎలా నెగ్గుతామో చేసి చూపిస్తాం అంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. గత ఐదేళ్లుగా కడప జిల్లాను, వైఎస్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కడపను గెలుస్తాం, ఏం చేస్తామో చూడండంటూ మొత్తం టీడీపీ శక్తులు ఆ జిల్లాపైనే దృష్టి పెట్టాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో ఎలాంటి రాజకీయాలు జరిగాయో రాష్ట్ర ప్రజలంతా చూశారు. కడప ఎంపీ అభ్యర్థిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేసినప్పుడే ఒక మహాకుట్రకు బీజం పడినట్లుగా అర్థమవుతోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ఎలాంటి ఆకృత్యాలు చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. కీలకమైన ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఇన్‌ఛార్జిగా ఉన్న వివేకానందరెడ్డి హత్యపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి.  వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తును జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. తద్వారా రాష్ట్ర సర్కారు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు.  

చంద్రబాబు, లోకేష్, ఆది ప్రమేయం
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యోదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రమేయం ఉందని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.దుర్గాప్రసాదరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైఎస్‌ కుటుంబాన్ని లేకుండా అంతంచేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. 1998 నుంచీ ఈ రోజు వరకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వేసే ప్రతి అడుగూ వైఎస్సార్‌ కుటుంబాన్ని అంతమొందించేలానే ఉందన్నారు.  ఇప్పుడు వివేకాని హత్య చేశారన్నారు. 1998లో వైఎస్‌ రాజారెడ్డి హత్యలో టీడీపీ ప్రమేయం ఉందన్నారు. అందులోని నేరస్తులను సత్ప్రవర్తన పేరుతో నిర్దోషులుగా విడుదల చేశారన్నారు. 2009, ఆగస్టు 30న అసెంబ్లీలో ‘ఎవరు ఫినిష్‌ అయిపోతారో చూడండి’ అని వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారని, ఆ తరువాత రెండ్రోజులకే వైఎస్‌ హెలీకాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారన్నారు. 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి ఎన్నికైన ఆదినారాయణరెడ్డి నీతి, విలువలకు కట్టుబడని దుర్మార్గమైన వ్యక్తి అని అన్నారు. హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేష్‌ అయితే కుట్రను అమలుచేసింది ఆది అని స్పష్టం చేశారు. 

కుటుంబ కలహాల్లేవు
వివేకాతో ఎటువంటి కుటుంబ కలహాలు లేవని, జమ్మలమడుగు ఎన్నికల ఇంఛార్జిగా ఉండి గురువారం రాత్రి 9.30 గంటల వరకూ  పనిచేశారని  వివరించారు. లోక్‌సభకు పోటీచేస్తానని వివేకానందరెడ్డి ఏనాడూ అనలేదని.. జగన్‌ను సీఎంని చేయాలనే ఎప్పుడూ కోరుకున్నారన్నారు. కుటుంబ సమస్యలు ఉన్నట్లుగా టీడీపీ దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు.

హత్యలో చంద్రబాబే సూత్రధారి 
ప్రొద్దుటూరు: రాష్ట్ర మాజీమంత్రి, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య సంఘటనలో సీఎం చంద్రబాబునాయుడు సూత్రధారి, మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రధారి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఇది ముమ్మాటికీ టీడీపీ ప్రభుత్వం చేయించిన హత్యేనన్నారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటూ జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో టీడీపీ మళ్లీ పాత రోజులను తీసుకొస్తుందేమోనని అనుమానం కలుగుతోందన్నారు. ఇది నూటికి నూటొక్క శాతం టీడీపీ కుట్రేనని శివప్రసాద్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇటీవల వివేకాను జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ నియమించిందని ఆయన గుర్తుచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ ఓట్లకు గండికొడతారనే దురుద్దేశంతోనే ఈ హత్య చేయించారని చెప్పారు. 

వైఎస్‌ కుటుంబంపై వరుస దాడులు: వైఎస్‌ కుటుంబంపై ఇలా వరుస దాడులు జరగడం విచారకరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ సంఘటనలో మరణిస్తే ఆ ఘటనపై నేటికీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. రెండేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డే ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వివేకా హత్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌వల్ల న్యాయం జరగదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.   

వివేకానందరెడ్డి మృతి తీరని లోటు 
పుంగనూరు (చిత్తూరు జిల్లా): మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వివేకానందరెడ్డి మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయ నేతగా ఖ్యాతి గడించిన వివేకానందరెడ్డి మరణం పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరనిలోటన్నారు. 

బాబువి హత్య రాజకీయాలు 
వైఎస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్‌ మీడియాతో మాట్లాడారు. అత్యంత సౌమ్యుడుగా పేరుగాంచిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల్లో గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారో అప్పుడే వివేకానందరెడ్డి హత్యకు బీజం పడిందన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ను కూడా హతమార్చడానికి యత్నించారని వారు గుర్తుచేశారు. హత్య దర్యాప్తునకు చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్‌పై తమకు నమ్మకంలేదని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌  చేశారు. కాగా, టీడీపీ సర్కార్‌ ఓట్లనే తొలగిస్తోందనుకున్నామని.. కానీ మనుషులనే తొలగిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.   

వివేకా మృతి తీరనిలోటు : ఉమ్మారెడ్డి 
వైఎస్‌ వివేకానందరెడ్డి లేనిలోటు తీర్చలేనిదని వైఎస్సార్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన లేకపోవటం కుటుంబానికి ఎంత లోటో వైఎస్సార్‌సీపీకీ అంతే లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వేసిన రికార్డు వివేకాదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఉమ్మారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.  

దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలి: కన్నా 
 వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసినా సీఎం చంద్రబాబు ఆధీనంలో ఉండే సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకంలేదు.

హత్య అత్యంత బాధాకరం: రఘువీరా 
వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య అత్యంత బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. వివాదాలకు అతీతంగా వ్యవహరించే వివేకాను హత్య చేయడం దారుణమన్నారు. అలాగే, తెలంగాణ ఎంపీ డి. శ్రీనివాస్‌ కూడా వైఎస్‌ వివేకా మృతిపట్ల సంతాపం తెలిపారు. ‘వివేకా హత్య వార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నా..’ అని పేర్కొన్నారు. 

హత్యపై లెఫ్ట్‌ దిగ్భ్రాంతి 
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపట్ల సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు కూడా శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. ఉమ్మడి ఏపీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్‌సీగా పనిచేసినా అతి సాదాసీదాగా ఉండే వ్యక్తని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యు డు డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కొనియాడారు. 

సమగ్ర విచారణ జరపాలి: ఆర్పీఐ 
వైఎస్‌ వివేకా దారుణ హత్యపై సమగ్ర విచారణ జరపాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ) (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హత్యపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
వైఎస్‌ వివేకా హత్యోదంతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కోరారు.

గుండెపోటుతో వివేకా అభిమాని మృతి
సింహాద్రిపురం: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని హిమకుంట్ల గ్రామానికి చెందిన చవ్వా వెంకటరెడ్డి (50)  శుక్రవారం మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి వార్తలను మీడియాలో చూస్తూ.. తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా