ఎల్లుండి స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

4 Jun, 2018 15:58 IST|Sakshi
స్పీకర్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు.

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సమావేశాల్లో సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు.. సమావేశాలు ముగిసిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశ రాజధాని హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. అన్నాపానాలు ముట్టక దీక్ష చేయడంతో ఎంపీల ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించి.. నిరాహార దీక్షలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక హోదా కంటే తమకు పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల స్పీకర్‌తో భేటీలోనూ వారు ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే, రాజీనామాలపై పునరాలోచన చేయాలని స్పీకర్‌ ఎంపీలను సూచించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి స్పీకర్‌ను కలువబోతున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరబోతున్నారు.

మరిన్ని వార్తలు