మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

22 Nov, 2019 14:40 IST|Sakshi

టచ్‌లో ఆ ఇద్దరు ఎవరో సుజనా చౌదరి చెప్పాలి 

సుజనా చౌదరి టీడీపీలో ఉన్నారా? ..బీజేపీలోనా?

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు  టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ ఎంపీలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 

చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుంది. సీఎం జగన్‌ అనుకుంటే అర్థగంటలో అందరూ వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరం. బీజేపీతో వైఎస్సార్ సీపీ  ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయిదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా?. ఇసుక అమ్ముకుని బతికిన ఘటన టీడీపీది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలంతా జగన్‌ పాలన శభాష్‌ అంటున‍్నారు.

సుజనా చౌదరి ఎవరూ అంటే బ్యాంక్‌ దొంగ అని అందరూ అంటారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా బ్యాంక్‌ దొంగ అనే వస్తుంది. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారు. బ్యాంకులకు రూ.6 వేలకోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలి.  మా కొన ఊపిరి ఉన్నంతవరకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటాం. ఏ మాత్రం స్తోమత లేని మమ్మల్ని ఎంపీలుగా వైఎస్‌ జగన్‌ గెలిపించారు.  మాపై పత్రికల్లో అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. రాధాకృష్ణ పేపర్‌ సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు  అని హితవు పలికారు. 

సుజనా చౌదరి నీతులు చెప్పడం మానుకో..
 
వైఎస్సార్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ... ‘ఎంగిలి మెతుకులు తిని సుజనా చౌదరి మాట్లాడవద్దు.  ఏపీలో టీడీపీ చచ్చిపోయింది. భవిష్యత్‌లో బతికే అవకాశమే లేదు. ఇంగ్లీష్‌ మీడియంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ నాయకుడిలా సుజనా చౌదరి ఎలా మాట్లాడతారు?. మేము రెండు  పూటలా తిండి కోరుకునేవాళ్లం. మీకులా బ్యాంకులకు కన్నాలు వేసేవాళ్లం కాదు. పైసా ఖర్చు చేయకుండా మేం ఎన్నికల్లో గెలిచాం. ఏపీని సూట్‌కేసుల చంద్రబాబు దోచుకున్నారు. మీ పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదు. 

సుజనా చౌదరి  పార్టీ మారినా...చంద్రబాబు కోవర్టుగా పని చేస్తున్నారు. చనిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు బీజేపీలో చేరారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. బ్యాంకులను మోసం చేసిన చౌదరి నీతులు చెప్పడం మానుకో. అరెస్ట్‌ల భయంతో బీజేపీ నేతల కాళ్లు మొక్కి ఆ పార్టీలో చేరారు. జైలుకు వెళ్లకుండా నిన్ను నువ్వ కాపాడుకో. మా మీద ఫోకస్‌ కాకుండా నీ పని చూసుకో. తమతో టచ్‌లో ఉన్నారని అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవు. పేదవాడికి టికెట్‌ ఇచ్చి గెలిపించిన నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయన ఆశయ సాధనకు పని చేస్తాం’  అని తెలిపారు.

మరిన్ని వార్తలు