స్పీకర్‌కు మరోసారి వైఎస్సార్‌ సీపీ ఎంపీల లేఖ

6 Jun, 2018 17:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మరోసారి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని లేఖలో మరోసారి స్పీకర్‌ను కోరారు. ‘గత నెల 29న రాజీనామాలపై పురాలోచన చేయాలని మీరు కోరారు.. మీ సలహాకు ధన్యవాదాలు. కానీ, మేం రాజీనామాలకే కట్టుబడి ఉన్నాం. 16వ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాం. తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి’  అని లేఖలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ మేరకు తమ రాజీనామాలను మరోసారి ధ్రువీకరిస్తూ.. ఎంపీలు స్పీకర్‌ కార్యాలయంలో ఎంపీలు లేఖలు అందంజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఏప్రిల్‌ 6న తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలు బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ మహాజన్‌ను గట్టిగా కోరారు. రాజీనామాల ఆమోదానికి ఎంపీలు పట్టుబట్టడంతో ఆమె అంగీకరించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామాల ఆమోదంపై తుది నిర్ణయం ఇదేనా అని స్పీకర్‌ అడిగితే.. అవునని ఆమె సమాధానం చెప్పారని, రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారని వివరించారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పీకర్‌కు వివరించినట్లు చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై నేటి సాయంత్రం లోగా అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు