కొత్త చదువుల లోకం.. జగన్‌తోనే సాధ్యం

10 Apr, 2019 09:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోర్సు ఏదైనా, ఫీజు ఎంతున్నా.. పేద విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇవ్వడంపై లక్షలాది మంది విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్ని లక్షల రూపాయలైనా సరే మొత్తం ఫీజురీయింబర్స్‌ మెంట్‌తో పాటు మెస్‌ చార్జీల(వసతి, భోజనం) కోసం ప్రతి విద్యార్థికి ఏటా అదనంగా రూ.20వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించడంపై సర్వత్రా సంతోషం కనిపిస్తోంది.

ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఫార్మసీ... ఇలా కోర్సు  ఏదైనా.. ఫీజు ఎంతున్నా.. పూర్తిగా ప్రభుత్వమే భరించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేస్తామని నవరత్నాల్లో ప్రకటించడం తమకు ఎంతో భరోసా ఇస్తోందని పేద, మధ్య తరగతి కుటుంబాలు పేర్కొంటున్నాయి.  ఫీజురీయింబర్స్‌మెంటు ఎంతైతే అంత మొత్తంతోపాటు అదనంగా ఏటా రూ.20 వేలు అందుతుంది. సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి 1.50 లక్షల వరకు ప్రతి విద్యార్థికి లబ్ధిచేకూరేలా.. ఈ పథకాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయనుంది.  

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పటిష్టంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన పాలకులు విద్యార్థుల చదువులను గాలికొదిలేశారు. ఫీజులు ఏటేటా పెంచేస్తూ.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ మాత్రం అరకొరగా విదిలిస్తూ.. అది కూడా సకాలంలో బకాయిలు చెల్లించకుండా.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చేశారు.

చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఫీజుల భారంతో దిక్కుతోచని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతాలెన్నో! పాలకుల నిర్లక్ష్యం శాపమై..  ఫీజులు పెనుభారమై.. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాల దు:ఖం చూసి చలించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి... ఫీజు ఎన్ని లక్షలున్నా పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ మాటంటే శిలాక్షరమేననే.. త్వరలోనే కొత్త చదువుల లోకం ఆవిష్కృతం కానుందనే సంతోషం లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది!! 

మొన్న 
1995–2004 చంద్రబాబు చీకటి పాలన
1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో ప్రైవేటీకరణకు తెరదీశారు. ప్రమాణాలను పట్టించుకోకుండా...ఇబ్బడిముబ్బడి ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులిచ్చారు. వాటిలో చేరాలంటే వేలల్లో ఫీజులు. చెల్లించే స్థోమత  లేక పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ చదువులకు దూరమయ్యారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల తొలివిడత పాలనలో చదువులంటేనే విపరీత భారంగా మారి ఆయా కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఆర్థిక స్థోమత లేని వారు చదువులకు దూరమయ్యారు. 

నిన్న..  
2004–2009: వైఎస్‌ హయాం.. ఉన్నత విద్యకు స్వర్ణయుగం
2004లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే విద్యారంగంపై దృష్టిపెట్టారు. ప్రతి పేద విద్యార్థి ఇంజనీరింగ్, మెడికల్‌ వంటి ఉన్నత చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిప్లొమో, డిగ్రీ.. ఇలా ఏ కోర్సు చదవాలన్నా అందుకయ్యే ఫీజులు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా కాలేజీలకు అందించేలా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి పేద విద్యార్థికి వర్తించేలా అమలు చేశారు. ఫలితంగా అప్పటివరకు పేద, మధ్యతరగతికి అందని ద్రాక్షగా ఉన్న ఉన్నత చదువులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. లక్షలాది మంది పేద విద్యార్ధులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. ఆయా కోర్సులు అభ్యసించారు.  

నేడు
2014–2019: చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిర్వీర్యం
ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. కోర్సు ఫీజు లక్షల్లో ఉంటే ఇచ్చేది అరకొర.. అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో.. విద్యార్థులు నానా బాధలు పడ్డారు. రాష్ట్రంలో ఒక విద్యార్థి ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తిచేయాలంటే.. మొత్తం నాలుగేళ్లలో ఏడాదికి లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇందులో ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.35 వేలు.  మిగతా రూ.70 వేలకు పైగా మొత్తాన్ని తల్లిదండ్రులు భరించాలి.  దీనికి అదనంగా వసతి, భోజన ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ అప్పుల భారం రూ.4 లక్షలకు పైగా అవుతోంది. ఆ ఫీజులు చెల్లించకపోతే విద్యార్ధులకు ఆయా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కుటుంబం అప్పులపాలవడం ఇష్టం లేక.. తన చదువులు వారికి భారంగా మారుతున్నాయని భావించి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. మరోవైపు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకపోతుండడంతో కాలేజీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రస్తుత రూ.35 వేల గరిష్ఠ ఫీజురీయింబర్స్‌మెంటు మొత్తాన్ని రూ.65 వేలు చేయాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.10 వేలు అదనంగా పెంచి రూ.రూ.45 వేలకు పరిమితం చేసింది.   

– సీహెచ్‌.శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు