‘చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించాలి’

2 Jun, 2018 12:06 IST|Sakshi
వంచనపై గర్జన దీక్షలో భూమన కరుణాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌

సాక్షి, నెల్లూరు : నవనిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలను మరింతగా వంచించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీనేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి హోదా కోసం ఢిల్లీ నగర వీధుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డేనని కొనియాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రగతిశీలి వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారని భూమన ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి సిద్ధం కావాలంటూ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘టీడీపీ-బీజేపీలు కలిసి వంచించాయి’
‘ఏపీ ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వండి, లేని పక్షంలో మా రాజీనామాలు అమోదించాలని’ వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకారి అని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధుడని.. అందుకే ఏపీకి సంజీవని లాంటి హోదా రాలేదని తెలిపారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో వైఎస్సార్‌సీపీ ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది. ఈ గర్జన దీక్షలో వరప్రసాద్‌ మాట్లాడుతూ.. హోదా రాకపోవడానికి 40 శాతం కేంద్ర తప్పిదాలు కారణమైతే, 60 శాతం అసమర్ధుడైన చంద్రబాబు నాయుడే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ కలిసి ఏపీని వంచించాయని ఎంపీ వరప్రసాద్‌ పేర్కొన్నారు.

నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు మరో మోసానికి సిద్ధపడ్డారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడంలో చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మండిపడ్డారు. చంద్రబాబు చేసే మోసాలను చూడలేక, ప్రజలను చైతన్యం చేసేందుకే ‘వంచనపై గర్జన’  దీక్షను వైఎస్సార్‌సీపీ చేపట్టిందని బొత్స తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు