రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు 

16 Jul, 2018 02:07 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ధర్మాన

     వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం 

     పార్లమెంటు ఆవరణలో నిరసనలు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేయాలని కూడా పార్టీ తీర్మానించింది. ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద ప్రజా సంకల్ప యాత్ర శిబిరంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్‌.. మూడు గంటల పాటు పార్టీ నేతలతో  పలు అంశాలపై సుదీర్ఘంగా  చర్చించారు. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చలేదని, అందువల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని, ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించినట్టు తెలిపారు. సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్‌ వెలుపల.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం పోరాడి పదవీ త్యాగం చేసిన.. లోక్‌సభ మాజీ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ విధంగా యావత్‌ దేశ ప్రజలకు తమ నిరసన తెలిసేలా చేస్తామని చెప్పారు.

సాధారణంగా ఇలాంటి రాజ్యాంగ పదవులకు జరిగే ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఒక ధృఢమైన అభిప్రాయంతో ఉందని, అయితే ఏపీ ప్రజలకు అత్యంత ముఖ్యమైన, ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి అవసరమైన ప్రత్యేక హోదా హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చిందని, చివరకు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఇచ్చిందని ధర్మాన వివరించారు. అప్పటికీ స్పందించనందున పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారన్నారు.

ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ప్రాముఖ్యమైనదిగా తాము భావిస్తున్నామని, అది ఇవ్వనందుకు నిరసనగానే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించామన్నారు. హోదా రాకపోతే ఎలా సాధించుకోవాలనే విషయంలో జగన్‌ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకపోతే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 20 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలిస్తే కేంద్రంలో రేపు ఏర్పడే ప్రభుత్వాలు మన వద్దకే వచ్చి ఇచ్చిన హామీని అమలు చేస్తాయని ధర్మాన అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు