ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

19 Mar, 2019 04:49 IST|Sakshi

25 లోక్‌సభ సీట్లకుగాను 22 స్థానాలు కైవసం

తెలంగాణలో మరోసారి సత్తా చాటనున్న టీఆర్‌ఎస్‌

కేంద్రంలో మళ్లీ మోదీకే పట్టం

కేరళ, తమిళనాడులో యూపీఏ హవా

కర్ణాటకలో కాంగ్రెస్‌–బీజేపీ హోరాహోరీ

టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019లో వెల్లడి

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019లో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాల్లో విజయదుందుభి మోగించనుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కబోదని స్పష్టం చేసింది. అలాగే గతంతో పోల్చుకుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లు టైమ్స్‌నౌ– వీఎంఆర్‌ సర్వేలో వెల్లడయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 45.5 శాతం ఓట్లు రాగా, ఈసారి ఏకంగా 48.8 శాతం ఓట్లను దక్కించుకోనుందని తెలిపింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40.5 శాతంగా ఉన్న టీడీపీ ఓటింగ్‌ శాతం ఈసారి 38.4 శాతానికి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌ 2.2 శాతం, బీజేపీ 5.8 శాతం, ఇతరులు 4.9 శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. 
 
తెలంగాణలో ‘కారు’హవా 
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) జోరు కొనసాగుతుందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్‌ ఈసారి 13 సీట్లను దక్కించుకుంటుందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ, ఇతరులు చెరో స్థానాన్ని దక్కించుకుంటారని అంచనా వేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌(2), టీడీపీ(1), బీజేపీ(1), వైఎస్సార్‌ కాంగ్రెస్‌(1), ఏఐఎంఐఎం(1) దక్కించుకున్నాయి. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 41.2 శాతం ఓట్లను దక్కించుకుంటుందని సర్వేలో తేలింది. అలాగే కాంగ్రెస్‌ 30.3 శాతం, బీజేపీ 17.6 శాతం, ఇతరులు, 10.9 శాతం ఓట్లను పొందుతారని అంచనా వేసింది. 
 
తమిళనాడులో యూపీఏ పైచేయి.. 
తమిళనాడులో ఈసారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి(యూపీఏ) మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వేలో తేలింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గానూ యూపీఏ 34 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) కూటమి కేవలం ఐదు సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో యూపీఏకు 52.20 శాతం, ఎన్డీయే 37.20, ఇతరులకు 10.60 శాతం ఓట్లు దక్కుతాయంది. 
 
కర్ణాటకలో హోరాహోరీ.. 
2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌–బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే చెప్పింది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్‌ 13 స్థానాల్లో, బీజేపీ 15 చోట్ల విజయం సాధిస్తాయని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 43.50 శాతం, బీజేపీ 44.30 శాతం, బీఎస్పీ 0.9 శాతం, ఇతరులు 11.20 శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. 
 
కేరళలో యూడీఎఫ్‌కు మెజారిటీ సీట్లు.. 
కేరళలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకుంటుందని సర్వేలో తేలింది. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో యూడీఎఫ్‌ 16 సీట్లు, వామపక్ష ఎల్డీఎఫ్‌ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని వెల్లడించింది. ఇక ఎన్డీయే కేవలం ఒక్క సీటుకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 45 శాతం, ఎన్డీయే 21.70 శాతం, ఎల్డీఎఫ్‌ 29.2 శాతం, ఇతరులు 4.10 శాతం ఓట్లను దక్కించుకుంటాయని తెలిపింది. 
 
మరోసారి మోదీకే పట్టం.. 
2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పట్టం కట్టబోతున్నారని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వేలో తేలింది. మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 283 చోట్ల ఘనవిజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ 135 సీట్లకు పరిమితం కానుండగా, ఇతరులు 125 స్థానాలను దక్కించుకుంటారని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయే కూటమి మెజారిటీకి 21 సీట్ల దూరంలో నిలిచిపోతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పలు ప్రజాకర్షక పథకాలు ఉండటం, అలాగే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులతో మోదీ ప్రభుత్వ ఇమేజ్‌ అమాంతం పెరిగినట్లు టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే పేర్కొంది. 2019, మార్చి నెలలో నిర్వహించిన టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 16,931 మంది అభిప్రాయాలను సేకరించారు.  

మరిన్ని వార్తలు