ఉచిత పంటల బీమా... అన్నదాతకు ధీమా..

1 Apr, 2019 08:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరవుపై యుద్ధం చేశానని, దుర్భిక్షంపై విజయం సాధించానని, రెయిన్‌ గన్లతో వర్షాభావ ప్రభావం లేకుండా చేశానని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు పాలనలో రైతుల దయనీయ స్థితిలో ఉన్నారు. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ఏ తుపానో, అకాల వర్షమో, అనావృష్టో ఎదురైతే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. మేలుకు బదులు కీడు జరుగుతోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై కాడి వదిలేసే దుస్థితి వస్తోంది.

కౌలు రైతుల పరిస్థితైతే మరింత దయనీయం. దీన్నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటల బీమా పథకాలను ప్రారంభించినా వాటిపై అవగాహన లేక, డబ్బులు కట్టినా అవి రావన్న స్వీయానుభవంతో రైతులు సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో సుమారు 85 లక్షల పైగా రైతులున్నారు. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఇందులో చేరుతున్నవారి సంఖ్య 16 లక్షలకు మించకపోవడం గమనార్హం.

ఉదాహరణకు ఎకరం వరికి ప్రభుత్వం నిర్ణయించిన రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) రూ.29,352 అనుకుంటే దానిపై మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం 8 శాతం. (ఒక్కో ప్రాంతంలో 9 శాతం ఉండవచ్చు.) ఈ లెక్కన రూ.2,348 ప్రీమియంగా చెల్లించాలి. ఇందులో రైతులు ఎకరానికి 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే మిగతా 6.5 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీతో రైతు తన వాటాగా చెల్లించాల్సిన 1.5 శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫలితంగా రైతుపై  భారం పడే అవకాశం ఉండదు. జగన్‌ హామీపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

బీమాకు ఎందుకింత ప్రాధాన్యత?
ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్‌ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యత వచ్చింది.  2016 ఖరీఫ్‌ నుంచి కేంద్రం– ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. అన్ని ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది.

బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియం మినహాయించి బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్‌ బీమా పథకంలో చేరే అవకాశముంది. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు.

అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, కరువు తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన నష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్‌ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరువాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకు అకాల వర్షాలు, తుపాను వల్ల నష్టం వాటిల్లితే బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రధాని పంటల బీమా కింద ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాలి. అదే ఉద్యాన పంటల రైతులైతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, రైతుల్లో అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు.  

నాలుగో వంతు కూడా దాటని వైనం... 
2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధాని ఫసల్‌ బీమా, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ కింద 15,97,435 మంది రైతులు బీమా చేయించుకుంటే 2017 నాటికి ఆ సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగో వంతు కూడా  బీమా చెల్లించలేదు.  రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించ లేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి.

జగన్‌ హామీతో అందరికీ మేలు... 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. నవరత్నాలలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసాను ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. దీనిప్రకారం రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్‌ వచ్చేలా చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం రైతాంగాన్ని ఆదుకుంటుంది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 85 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు. 

  – ఎ.అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

మరిన్ని వార్తలు