‘అత్తార్‌’ కోసం అందరినీ బలి చేస్తున్నారు

19 Apr, 2018 07:23 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి ఇంట్లో సమావేశమైన బాధితులు

ఆక్రమణల తొలగింపులో అలైన్‌మెంట్‌ మార్చారు

అత్తార్‌ లాడ్జిని కూల్చాకే మా కట్టడాల జోలికి రావాలి

కాదని దౌర్జన్యం చేస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం

పలువురు వ్యాపారులు, పట్టణ ప్రజల మండిపాటు

కదిరి : ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి డబ్బుకు కక్కుర్తిపడి టీడీపీలో చేరిన అత్తార్‌ చాంద్‌బాషాకు సంబంధించిన ‘అత్తార్‌’ లాడ్జిని ఆక్రమణల తొలగింపు నుంచి తప్పించడం కోసం ఎంతోమంది అమాయకుల ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే జరిగితే చాంద్‌బాషా ఇంటిముందు కిరోసిన్‌ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా వెనుకాడం’ అని పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు, ఇళ్ల యజమానులు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బుధవారం వారంతా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కడపల మోహన్‌రెడ్డి స్వగృహంలో సమావేశమై విలేకరుల ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు.

ఆక్రమణల తొలగింపునకు ఇటీవల పట్టణంలో మార్కింగ్‌ ఇచ్చారని, అయితే చాంద్‌బాషా లాడ్జిని తప్పించడం కోసం మొత్తం అలైన్‌మెంట్‌నే మార్చేశారని వారు ఆరోపించారు. జాతీయ రహదారికి పడమర వైపున ‘అత్తార్‌’ లాడ్జి ఉన్నందున అటువైపు ఏమాత్రం మార్కింగ్‌ ఇవ్వలేదన్నారు. రోడ్డుకు తూర్పువైపున మాత్రమే ఆక్రమణలను తొలగిస్తామంటూ మార్కింగ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటని మండిపడ్డారు. అలాగే రోడ్డుకు తూర్పు వైపునే ఉన్న చాంద్‌బాషా సోదరుడు మండిబాషా దుకాణాన్ని కూడా తొలగింపు నుంచి తప్పించారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణల తొలగింపు సమయంలో ఆయన ముందుగా పులివెందులలో ఉన్న తన ఇంటిని కూల్చేయించా రని గుర్తు చేశారు.

ఆ విషయాన్ని ఈ నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అప్పట్లో కదిరిలో కూడా ఆక్రమణలు తొలగించారని, అప్పుడు ఇక్కడ కూడా తొలగింపు నిజాయితీగా జరిగిందని చెప్పారు. డబ్బు, మంత్రి పదవి ఆశతోపాటు ఆక్రమణల నుంచి తన లాడ్జిని కాపాడుకోవడం కోసమే చాంద్‌బాషా పార్టీ మారినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. చాంద్‌బాషా లాడ్జిని కూల్చిన తర్వాతే తమ ఇళ్లను కూల్చాలని, అలా లేదంటే ఊరుకునేది లేదని బాధితులు హెచ్చరించారు. అధికార బలంతో పోలీస్‌ బలగాలను తీసుకొచ్చి కూల్చాలని చూస్తే మూకుమ్మడి బలవన్మరణాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు