అన్నదాతలందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా

20 Dec, 2017 01:19 IST|Sakshi
మారాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

     ఒక్కొక్కరికీ ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం

      రైతులతో ముఖాముఖిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ 

     మూడు జిల్లాల పాదయాత్రలో వచ్చిన వినతుల మేరకు నిర్ణయం 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు అందజేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో రైతుల నుంచి వచ్చిన వినతులను, వాస్తవ స్థితిగతులను పరిశీలించిన తర్వాత తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని మొదట్లో భావించినప్పటికీ క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఎంత భూమి ఉందనే దాంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని ప్రతి రైతుకూ పెట్టుబడి కింద ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అనంతపురం జిల్లా  తనకంటివారిపల్లి గ్రామ శివారు నుంచి మంగళవారం 39వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జగన్‌.. మారాల గ్రామ శివార్లలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తాను అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే కార్యక్రమాలను రైతులకు వివరించారు. రైతులందరికీ వడ్డీ లేని పంట రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..   

రైతులను వెన్నుపోటు పొడవడంలోనా మీ అనుభవం? 
చంద్రబాబు హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. నేనిక్కడకు వచ్చే ముందు ఓ రైతు నన్ను కలిసి.. అన్నా, 44 కేజీల వేరుశనక్కాయల్ని 1300కు అడుగుతున్నారన్నా.. ఎలా అమ్మమంటావన్నా? అని అడిగాడు. అసలే కరువు, ఆపైన అకాల వర్షాలు.. ఈ రెండింటి నడుమ ఎకరాకు 4, 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. అట్లని గిట్టుబాటూ ధరా లేదు. ఎంత దారుణమైన పరిస్థితి.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. పత్తి, మిర్చి ఇలా ప్రతి పంటా ఇంతే. పత్తి క్వింటాల్‌ రూ.3 వేలకు మించి ధర పలకడం లేదంటున్నారు రైతులు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఉండాలి. రైతులకు అండగా నిలిచేందుకు ఆవేళ నేను రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తే, ఇదే పెద్దమనిషి నాకన్నా సీనియర్‌ అని, అనుభవం ఉన్నవాడినని చెబుతూ రూ.5 వేల కోట్లన్నాడు. అనుభవం, సీనియారిటీ అంటే రైతుల్ని వెన్నుపోటు పొడవడంలో కాదు చంద్రబాబూ..  ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతులు మిర్చి, ఉల్లి, టమాట తదితర పంటలు సాగు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. టమాటాను రోడ్ల మీద, ఉల్లిని చేలల్లోనే వదిలేసే పరిస్థితులు నెలకొన్నాయి.  

అధిక వడ్డీలతో రైతులు నష్టపోకూడదని.. 
ప్రస్తుతం రైతులు నాలుగు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకటి పెట్టుబడుల కొరత. పెట్టుబడి దొరక్కపోతే పంటలు వేసుకునే పరిస్థితి ఉండదు. చంద్రబాబు పుణ్యమా అని రైతులు బ్యాంకుల గడప తొక్కలేని పరిస్థితి. ఫలితంగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అలా చేయడం వల్ల గిట్టుబాటు కాదు. అందుకే రైతుల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రకటించాం. వర్షాలు పడిన వెంటనే రైతులు జూన్‌లో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. దానికి ఒక నెల ముందే అంటే మే నెలలోనే పెట్టుబడి కింద ఈ పథకంలో భాగంగా రూ.12,500 రైతు చేతిలో పెడతాం. ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు 5 ఎకరాల లోపు వారికే అనుకున్నాం. కానీ ఈ మూడు జిల్లాల పర్యటన తర్వాత రైతుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా ప్రతి రైతుకూ పెట్టుబడిగా రూ.12,500 ఇస్తాం. ఒక ఎకరం ఉన్న రైతుకైతే 80, 90 శాతం పెట్టుబడి వస్తుంది. రెండెకరాలు ఉంటే 40, 50 శాతం వస్తుంది. మిగతా వారికి కాస్తో కూస్తో అండగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గించిన తర్వాత రైతులకు కావాల్సింది విద్యుత్‌. రైతులందరికీ 9 గంటల పాటు పగటి పూట ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తాం. ఆ తర్వాత రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇప్పిస్తాం. చంద్రబాబు హయాంలో అటు రైతులకు, ఇటు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఈ వడ్డీ లేని రుణాలు లేకుండా పోయాయి. కానీ మన ప్రభుత్వం అలా చేయదు. ప్రతి రైతుకూ, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేకుండా పంట రుణాలు ఇస్తుంది.  

గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొంటుంది.. 
పంటలకు గిట్టుబాటు ధర లేక గత నాలుగేళ్లలో రైతులు ఎలా నష్టపోయారో, ఎంత అన్యాయం జరిగిందో చూశాం. ఆ పరిస్థితి తలెత్తకుండా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. రైతుల సంక్షేమం కోసం ఆ మూడు వేల కోట్ల రూపాయలు పోయినా సరే పర్వాలేదు. పంట వేసే ముందే ఏ పంటను ఎంత గిట్టుబాటు ధరకు కొంటారో ప్రకటన చేస్తాం. ఆ ధరకు ఎవ్వరూ కొనడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వమే కొంటుంది. ఆ తర్వాత రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ సరకును నిల్వ చేసుకునే సౌకర్యం. అందుకోసం మన ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక శీతల గిడ్డంగి (కోల్డ్‌ స్టోరేజీ) నిర్మిస్తుంది. టమాట, ఉల్లి, మామిడి, మిర్చి, అరటి వంటి పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు వాటిని ఈ గిడ్డంగుల్లో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. అకాల వర్షం, మరేదైనా ఉపద్రవమో వచ్చినప్పుడు రైతుల్ని ఆదుకునే ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు ఇన్‌పుట్‌ సబ్సిడీలో కోత వేసేందుకు ఏవేవో చేస్తున్నారు.

కరవు మండలాలను ప్రకటిస్తే ఎక్కడ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందోనని ఈ ఏడాది వాటిని అసలు ప్రకటించనే లేదు. జూన్‌ నుంచి ఆగస్టు 9 వరకు 32 శాతం వర్షపాతం లోటు ఉంది. అయినా క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టడు. చర్చించడు. కానీ మన ప్రభుత్వం వచ్చాక.. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రూ.2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లు ఇస్తుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో ఆ నిధి ఏర్పాటవుతుంది. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ఈ నిధి నుంచి రైతన్నలను ఆదుకోవచ్చు. రైతులకు కావాల్సింది సాగు నీటి భరోసా. నీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. పోలవరం మొదలు హంద్రీ–నీవా వరకు ఏ సాగు నీటి ప్రాజెక్టును తీసుకున్నా ఇదే పరిస్థితి. కారణం కమీషన్లు, లంచాలే. వాటి కోసం ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్నారు. మన ప్రభుత్వం రాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి మీరు ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తే అవసరమైతే మార్పు, చేర్పులు చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.    

>
మరిన్ని వార్తలు