ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు

20 Mar, 2019 10:25 IST|Sakshi

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ మండలం అల్లుళ్లే 

సాక్షి, వైవీయూ : రాజంపేట నియోజకవర్గం పరిధిలోని నందలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకే మండలం నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు ఇదే మండలంలో పెళ్లిళ్లు చేసుకుని మండలం అల్లుళ్లు కావడం విశేషం. 1967, 1972, 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు రత్నసభాపతి స్వగ్రామం నందలూరు మండలం యల్లంపేట. అలాగే 1978, 1983, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు ప్రభావతమ్మ, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డిల స్వగ్రామం నందలూరు మండలంలోని పాటూరు గ్రామం.

1994, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పసుపులేటి బ్రహ్మయ్యది మండలంలోని పొత్తపి గ్రామం. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా వెంకట మల్లికార్జునరెడ్డిది మండలంలోని చెన్నయ్యగారిపల్లె. అదే విధంగా 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు మారారెడ్డి నందలూరు మండలంలో పెళ్లి చేసుకోవడంతో ఆయన ఈ మండలానికి అల్లుడయ్యారు. ఇక 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి నందలూరు మండలంలోని గట్టుమీదపల్లెలో వివాహం చేసుకోవడంతో ఈయన కూడా నందలూరు మండలం అల్లుడయ్యారు. కాగా ఇదే మండలంలోని ఈదరపల్లెకు చెందిన భూమన కుటుంబ సభ్యులైన భూమన కరుణాకర్‌రెడ్డి 2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. వీరు గత కొన్ని సంవత్సరాల క్రితమే తిరుపతి చేరుకుని అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఈయనతో కలుపుకుంటే మండలం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి సంఖ్య 6కు చేరుతుంది. 

మరిన్ని వార్తలు