అభివృద్ధే లక్ష్యం..

23 Mar, 2019 11:44 IST|Sakshi

 వైఎస్సార్‌సీపీ బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య  

అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బద్వేలు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్సార్‌సీపీ బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన పాలనకు ఆకర్షితుడినై రాజకీయాల్లో ప్రవేశించానని, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సహకారంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్‌ కేటాయించారని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నడాక్టర్‌ వెంకటసుబ్బయ్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..  

ప్రశ్న: మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? 
జవాబు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అందిస్తున్న సువర్ణ పాలనకు ఆకర్షితుడినై 2009లో డీసీ గోవిందరెడ్డితో కలిసి సామాన్య కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చా. వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్న నన్ను 2016లో డీసీ గోవిందరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమించి ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.  
ప్రశ్న: ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతోంది? 
జవాబు: వైఎస్సార్‌సీపీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన నాటి నుండి ఇప్పటి వరకు గడప గడపకు వైఎస్సార్, పల్లెనిద్ర, రావాలి జగన్‌ – కావాలి జగన్, ఇంటింటికి వైఎస్సార్‌ వంటి కార్యక్రమాలతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లాను. ప్రస్తుతం ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో గ్రామాల వారీగా, పంచాయతీల వారీగా ప్రచారం ముమ్మరం చేశాం. టీడీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ఈసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు.  
ప్రశ్న: నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు?  
జవాబు: ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లాను. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవు. పేదలకు సరైన వైద్యం కూడా అందడం లేదు. 
ప్రశ్న: మీ లక్ష్యం ఏమిటి?
జవాబు: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, జగనన్న, గోవిందరెడ్డిల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందగానే సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతాను. నియోజకవర్గంలో వైఎస్సార్‌ మెమోరియల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసి పేదలందరికి ఉచిత వైద్యం అందిస్తాను.  

మరిన్ని వార్తలు