దగాకోర్లను నిలదీయండి

10 Apr, 2018 01:09 IST|Sakshi
ఎంపీల దీక్షకు సంఘీభావం తెలుపుతున్న జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌.

ప్రజలకు వైఎస్సార్‌సీపీ పిలుపు.. నేడు జాతీయ రహదారుల దిగ్బంధం.. రేపు రైల్‌రోకోలు

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలకు సంఘీభావంగా ఇప్పటికే నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలతోపాటు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని, బుధవారం నాడు రైల్‌రోకో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంతకల్, గుత్తి, కర్నూలు, అనంతపురంలలో రైల్‌రోకోలు నిర్వహించాలని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగినంత వరకూ ప్రతిరోజూ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించింది. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయరెందుకు 
ప్రత్యేక హోదా సాధన కోసం అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదో ప్రశ్నించాలని ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. రాజీనామా చేయకుండా కుంటిసాకులు వెతుక్కుంటున్న టీడీపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీయాలని పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది. టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదు? వైఎస్సార్‌సీపీ ఎంపీలతోపాటు వారు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయడం లేదు? 25 మంది పదవులు వదులుకుని, ఆమరణ దీక్షకు దిగితే... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగదా? ఎంపీల రాజీనామాలు, దీక్షలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, ప్రత్యేక హోదా ఇవ్వరా? రాజీనామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఎందుకు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు? లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తే అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించదా? రేపు ఉప ఎన్నికలు వచ్చినా ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అవకాశం రాదా? ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. 

నాలుగో రోజుకు ఎంపీల దీక్ష 
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆయన రక్తంలో చక్కెరస్థాయి పడిపోవడం, డీహైడ్రేషన్‌తో బాధపడుతుండడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దీక్షా వేదికపై ఎంపీలకు సంఘీభావం తెలిపారు. 

శరద్‌ యాదవ్‌ సంఘీభావం 
జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ దీక్షా వేదికను సందర్శించి వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలను అభినందిస్తున్నానని, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని శరద్‌ యాదవ్‌ అన్నారు. ఎంపీల ఆమరణ దీక్షకు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు.  

ప్రాణాలైనా అర్పిస్తా: వైవీ సుబ్బారెడ్డి 
ప్రత్యేక హోదా సాధన కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి అన్నారు.  దీక్ష కొనసాగిస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆంబులెన్స్‌లోకి ఎక్కించి రామ్‌మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయగా సుబ్బారెడ్డి బీపీ 104/60, షుగర్‌ లెవెల్స్‌ 64కు పడిపోయాయి.  దీక్ష విరమణకు నిరాకరించడంతో వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆర్‌ఎంఎల్‌లో చికిత్స పొందుతున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావులను  వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. రాత్రి మేకపాటి, వరప్రసాదరావు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు 

మరిన్ని వార్తలు