రేపు కలెక్టరేట్ల ముట్టడి; ప్రజాసంకల్పయాత్రకు విరామం

28 Feb, 2018 12:23 IST|Sakshi

ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేసిన వైఎస్సార్‌సీపీ

మార్చి 5న ఢిల్లీలో భారీ ధర్నా

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హక్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. మార్చి 1న కలెక్టరేట్ల ముట్టడి, పార్లమెంట్‌ సమావేశాలు పునఃప్రారంభమయ్యే మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా తదితర రూపాల్లో నిరసన చేపట్టనుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలందించారు.

రేపు కలెక్టరేట్ల ముట్టడి : హోదా సాధనే ఏకైక డిమాండ్‌తో మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ క్యార్యక్రమంలో పాల్గొననున్నారు. కలెక్టరేట్ల ముట్టడి పిలుపు నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం ప్రజా సంకల్పయాత్రకు విరామం ఇవ్వనున్నారు. మార్చి 2న (శుక్రవారం) పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది.

మార్చి 3న ఢిల్లీకి ఎంపీలు : పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ మార్చి3న వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించిన దరిమిలా పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిసి ఎంపీలు బయలుదేరనున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు నుంచి ఢిల్లీ వెళ్లే నేతల వాహన శ్రేణిని జగన్‌ జెండా ఊపి పంపనున్నారు.

మార్చి 5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా : పార్లమెంట్‌ సమావేశాలు పునఃప్రారంభమయ్యే రోజునే ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. జంతర్‌మంతర్‌ వేదిక వద్ద జరిగే ధర్నాలో ఎంపీలతోపాటు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటారని తలశిల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు