నేడు వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు

5 May, 2018 05:14 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు నిరసనగా కార్యక్రమం 

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు

14న పశ్చిమ గోదావరిలోకి ప్రజాసంకల్ప యాత్ర

14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు

16న జిల్లా కలెక్టరేట్ల వద్ద ‘వంచనపై గర్జన’ పేరుతో ధర్నాలు

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస లైంగిక దాడులకు నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీలను చేపడతామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి అత్యంత బాధాకరమని దీని పట్ల తమ పార్టీ తీవ్ర నిరసన తెలుపుతోందన్నారు.

మహిళలకు, బాలికలకు అండగా ఉంటామని, భరోసా కల్పిస్తామని తెలియజేయడానికే ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వారి నిర్లక్ష్య వైఖరే మహిళలపై దౌర్జన్యాలు జరగడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. కాగా.. ఈ నెల 14న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుందని, ఆ రోజుకు ఆయన 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తారని తెలిపారు. ఇప్పటివరకూ పాదయాత్ర జరిగిన జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వం చేతిలో ఎలా వంచనకు గురయ్యారో వైఎస్‌ జగన్‌ ప్రత్యక్షంగా చూశారని అన్నారు. రాబోయే రోజుల్లో నవరత్నాలు ద్వారా వారికి భరోసా కల్పిస్తారని చెప్పారు.

జగన్‌ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు చేస్తాయన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలపై ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. 16న ‘వంచనపై గర్జన’ పేరుతో అన్ని కలెక్టరేట్‌ల వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.

మహారాష్ట్ర బీజేపీ ఆర్థిక మంత్రి సుధీర్‌ భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనంతో చంద్రబాబు ధర్మపోరాటం అనే పేరుతో అధర్మ పోరాటం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏపీని అత్యాచారాలకు, అరాచకాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌ మాఫియా, రేషన్‌ కార్డుల మాఫియా, జన్మభూమి మాఫియా, ల్యాండ్, మైనింగ్‌ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియాలను తయారుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఓటుకు కోట్లు తర్వాత రాజధానిని తెరమీదకు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించి ఎండాకాలం వర్షాలకే లీకులు వచ్చే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు.  

>
మరిన్ని వార్తలు