ఎంపీ స్థానాలు క్లీన్‌ స్వీప్‌!

25 May, 2019 10:53 IST|Sakshi
మిథున్‌రెడ్డి ,శివప్రసాద్‌

రాజంపేటలో మిథున్‌రెడ్డికి రెండో విజయం

ఫ్యాన్‌ గాలికి టీడీపీ కంచుకోట బద్ధలు

పదిలంగా తిరుపతి పార్లమెంటు స్థానం

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో వెలువడ్డ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కనివినీ ఎరుగనిరీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించా రు. రాజంపేట పార్లమెంటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెండోమారు అదే స్థానం నుంచి గెలుపొందారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న చిత్తూరులో ఫ్యాన్‌ గాలి  వీచింది. తిరుపతి స్థానం వైఎస్సార్‌సీపీదేనంటూ ప్రజలు దుర్గాప్రసాద్‌ను ఆదరించి గెలిపించారు.

మిథున్‌కే పట్టం
రాజంపేట ఎంపీ స్థానానికి 2014లో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తొలిసారిగా పోటీలో దిగారు. రాజకీయం ద్వారా ప్రజాసేవకు దగ్గరకావొచ్చనే అభిప్రాయంతో పోటీచేసిన తొలిసారే మిథున్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని రాజంపేటలో మిత్రపక్షానికి సీటును వదిలిచ్చింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసిన దగ్గుబాటి పురందేశ్వరి.. మిథున్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీకి 6.01 లక్షల ఓట్లు పోలవగా.. బీజేపీకి 4.26 లక్షల ఓట్లు పడ్డాయి. ప్రత్యేక హోదా నినాదంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామాచేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన మిథున్‌పై బలమైన ప్రత్యర్థిని దింపడానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అయితే ఇక్కడ నిలబడడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభను పోటీలోకి దించారు. తనవల్ల కాదన్నా.. మిథున్‌రెడ్డిని ఆర్థికంగా ఢీకొట్టి ఓట్లకు రూ.కోట్లు వెదజల్లే అభ్యర్థి సత్యప్రభేనంటూ బాబు చేసిన వ్యూహాలు తిప్పికొట్టాయి. ఎమ్మెల్యేగానే చిత్తూరు వాసులకు అందుబాటులో ఉండని సత్యప్రభను రాజంపేట ప్రజలు సైతం అంగీకరించలేకపోయారు. మిథున్‌రెడ్డికే రెండోమారు పట్టం కడుతూ తీర్పునిచ్చారు. ఈయనకు 7,02,211 ఓట్లు పడగా.. సత్యప్రభకు 4,33,927 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మిథున్‌కు వచ్చిన మెజారిటీ (1.75 లక్షల ఓట్లు)తో పోలిస్తే ఇది అత్యంత భారీ మెజారిటీ కావడం విశేషం.

తిరుపతిలోనూ హవా
తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బల్లి దుర్గాప్రసాద్‌ను ఇక్కడి ప్రజలు ఆదరించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈమె ఓటమికి కారణంగా నిలుస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగ్గా.. టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థికి సీటునిచ్చింది. వరప్రసాద్‌కు 5.80 లక్షల ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి జయరామ్‌కు 5.42 ఓట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు వెలువడ్డ ఫలితాల్లో ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపు నిలబడి భారీ మెజారిటీ అందించారు. దుర్గాప్రసాద్‌కు 7,22,877 ఓట్లు పోలవగా.. పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ తిరుపతిలో 2,28,376 భారీ మెజారిటీ నమోదు చేసింది.   

వేషాలు పండలేదు
టీడీపీకి కంచుకోటగా ఉన్న చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బద్దలు కొట్టింది. 1996 నుంచి 2014 వరకు వరుసగా ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. రెండుసార్లు చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్‌ మూడోసారి ఓటమి చవిచూశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో శివప్రసాద్‌ ఘోర పరాజయం పొందారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న శివప్రసాద్‌ జిల్లా కేంద్రంలో ఎప్పుడూ అందుబాటులో ఉండలేదు. మెజారిటీ తెచ్చిపెట్టిన కుప్పంలో సైతం ఈయన కనిపించరు. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు అక్కడ నాలుగు వేషాలు వేయడం.. ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ జనాలకు కనిపిం చేవారు. దీంతో ఈయన్ను ప్రజలు ఆదరించలేదు. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌ చరీష్మా.. రెడ్డెప్ప చంద్రగిరి నుంచి కుప్పం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉంటానని చెప్పడం గెలుపునకు కారణమయ్యింది. గత ఎన్నికల్లో శివప్రసాద్‌కు 44,139 ఓట్ల స్వల్ప మెజారిటీతో శివప్రసాద్‌ బయటపడ్డారు. కానీ ఈసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డెప్పకు 6,86,792 ఓట్లు, శివప్రసాద్‌కు 5,49,521 ఓట్లు పడ్డాయి. 1,37,271 భారీ మెజారిటీతో వీచిన ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది.

మరిన్ని వార్తలు