తొలగింపు కుట్రలను అడ్డుకోవాలి

2 Mar, 2019 08:05 IST|Sakshi
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విశ్వేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు చనిపోయిన నాగమ్మ పేరుతో వచ్చిన ఫారం 7

తమ పేర్లతో ఓట్లు రద్దు చేస్తున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

సైబర్‌ క్రైమ్‌ కింద చర్యలు తీసుకుంటాం : రిటర్నింగ్‌ అధికారి

విజయనగరం , కురుపాం: తాము దరఖాస్తులు చేయకుండానే తమ పేర్లుతో ఫారం 7 కింద అక్రమంగా  నమో దు చేసి కొంతమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల  ఓట్లు తొలగించారని.. అటువంటి అక్రమ నమోదులను అడ్డుకోవాలని కురుపాం మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాయిపిల్లి శ్రీధర్, మండల బూత్‌ కన్వీనర్‌ జీవీ శ్రీనివాసరావు, మండల వైస్‌ ఎంపీపీ వంజరాపు కృష్ణతో పాటు కిచ్చాడకు చెందిన గవర చంద్రశేఖర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విశ్వేశ్వరరావును కోరారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన్ని కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ,  కొంతమంది కావాలనే తమ పేర్లతో  ఇతరుల ఓట్లు తొలించేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారన్నారు. తమ పేర్లతో ఆన్‌లైన్‌లో ఎవరు దరఖాస్తులు చేశారో... అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి స్పందించిన రిటర్నింగ్‌ అధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, కురుపాం నియోజకవర్గంలో 3,349 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయన్నారు.  దరఖాస్తులు వచ్చినంత మాత్రా న ఓట్లు తొలగించమని... బూత్‌ లెవిల్‌ అధికారులు  పరిశీలించిన తర్వాతే తొలగిస్తామని చెప్పా రు. అలాగే ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారన్నదానిపై ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు తహసీల్దార్ల ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు. సదరు వ్యక్తులు ఏ కంప్యూటర్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఫారం 7కు నమోదు చేశారో తెలుసుకొని వారిపై సైబర్‌ క్రైమ్‌ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా ..?
కురుపాం నియోజకవర్గంలో ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 3349 దరఖాస్తులు ఫారం 7 కింద ఆన్‌లైన్‌లో  నమోదు కాగా వీటిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పేరుతో దరఖాస్తు చేయడం విశేషం. ముఖ్యం గా కురుపాం, మొండెంఖల్, కిచ్చాడ,  నీలకంఠాపురం, ధర్మలక్ష్మీపురం, జి. శివడ, తిత్తిరి, గొత్తిలి, గిరిజన గ్రామాలకు చెందిన చాలా మంది ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకుల పేరుతో తొలగింపులకు దరఖాస్తు చేయడంపై ఎవరో కావాలనే చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భయపడాల్సిన అవసరం లేదు
ఫారం 7 కింద దరఖాస్తు చేసినంత మాత్రాన ఓట్లు తొలగించే పరిస్థితి లేదు. సంబంధిత ఓటర్ల వద్దకు బీఎల్‌ఓలు వెళ్లి  దర్యాప్తు చేపడతారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎవరు నమోదు చేశారో వారిపై సైబర్‌క్రైమ్‌ కింద కేసులు నమోదు చేస్తాం.– వి.విశ్వేశ్వరరావు,ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ,కురుపాం

చర్యలు తీసుకోవాలి
పోలింగ్‌స్టేషన్‌ –3 పరిధిలో పది మంది ఓటుహక్కు తొలగించాలని ఎవరో నా పేరుమీద దరఖాస్తు చేశారు. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు తెలియకుండా ఎలా దరఖాస్తు చేశారో అర్థం కావడం లేదు.  – రాయిపిల్లి శ్రీధర్‌ (వైఎస్సార్‌సీపి ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ,కురుపాం మండలం)

చనిపోయిన అమ్మ..కొడుకు ఓటు తీయమంది...
ఓటర్ల నమోదు, తొలగింపులకు వస్తున్న దరఖాస్తులు చూస్తుంటే మతిపోతోంది. ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పేర్లతో కొంతమంది అక్రమార్కులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సాలూరు మండలంలోని కురుకుట్టి గ్రామానికి చెందిన చిప్పాడ నాగమ్మ ఈ ఏడాది జనవరిలో చనిపోయింది. అయితే ఆమె కుమారుడు గాంధీ ఓటును తొలగించాలని నాగమ్మే ఈ నెల 23,24 తేదీల్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటరు కార్యక్రమంలో దరఖాస్తు చేసిందట. ఉన్న మనిషి ఓటును లేని మనిషి తొలగించాలని ఎలా దరఖాస్తు చేసిందే అధికారులకే తెలియాలి.    – సాలూరు

>
మరిన్ని వార్తలు