హోదా కోసం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఆందోళన 

19 Dec, 2018 03:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం కూడా పార్లమెం టులో ఆందోళన కొనసాగించింది. ఉదయం సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజ్యసభ ప్రారంభమైన తర్వాత వెల్‌లోకి వెళ్లి ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఏఐఏడీఎంకే సభ్యులు కావేరీ నదిపై ప్రాజెక్టులు కట్టొద్దని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్‌ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ ప్రారంభమైనప్పటికీ యథాతథస్థితి నెలకొనడంతో సభను తిరిగి బుధవారానికి వాయిదా వేశారు. ఇక టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మధ్యాహ్నం వరకు దీక్ష చేశారు. టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద, లోక్‌సభ వెల్‌లోకి వెళ్లి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.
 

మరిన్ని వార్తలు