రాజాపై ఎస్‌ఐ దాడి; వైఎస్‌ జగన్‌ సీరియస్‌

30 Oct, 2017 15:47 IST|Sakshi

ఈ ఘటనను జగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు: వాసిరెడ్డి పద్మ

ఎస్‌ఐపై క్రిమినల్‌ కేసు పెట్టాలన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి

రాజాపై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని తమ పార్టీ నాయకులను టార్గెట్‌ చేసినట్టు కనబడుతోందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపించారు. అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, సుధాకర్‌బాబు, పైలా సోమినాయుడు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం సబ్‌ ఇన్‌స్పెక్టర్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఎస్‌ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని, రెచ్చగొట్టే చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు.

రాజాపై దాడిని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీరియస్‌గా పరిగణిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కారు పార్కు చేసినందుకు ఈడ్చి, చొక్కాలు పట్టుకొని లాఠీలతో కొడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అండతోనే ఈవిధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలన్నారు.

రామచంద్రాపురం ఘటనతో సభ్యసమాజం తలదించుకుంటోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఎస్‌ఐ నాగరాజును సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయవాడలో మీడియా సమావేశంలో పైలా సోమినాయుడు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, సుధాకర్‌బాబు

మరిన్ని వార్తలు