విధులు, అర్హతల గురించి వివరించాం: ఉమ్మారెడ్డి

16 May, 2019 14:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో గురువారం వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస‍్సాఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లాం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్‌ తదితరులు హాజరయ్యారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల విధులు, బాధ్యతల గురించి ట్రైనింగ్‌ ఇచ్చామాన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లతో సహా మొత్తం 400 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఏజెంట్లు, రిజర్వ్‌ ఏజెంట్లు ఎంత మంది ఉండాలి.. వారికి ఉండాల్సిన అర్హతల గురించి వివరించామన్నారు. రౌండ్స్‌ వారిగా తీసుకోవాల్సిన చర్యలు.. రీకౌంటింగ్‌ ఏ సందర్భంలో కోరవచ్చో తెలియజేశామన్నారు.

ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్‌ నిలుపుదల చేస్తే.. తక్షణమే రీకౌంటింగ్‌ నిర్వహించేలా ఎన్నికల సంఘం పని చేస్తుందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పామన్నారు. కౌంటింగ్‌ హాల్‌లోకి వెళ్లిన తరువాత ఫోన్లు వాడకూడదని సూచించమన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రింట్‌ చేసి ఇచ్చిన మాన్యువల్‌ కూడా అందరికీ ఒక కాపీ అందజేశామన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కౌంటింగ్‌ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్‌ ఇచ్చాం

మరిన్ని వార్తలు