విజయం మాదే: విజయసాయిరెడ్డి

27 Dec, 2018 16:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి
ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

హోదా కవచంతో వస్తున్నారు: జంగా
ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగు ప్రజల హక్కు అని వైఎస్సార్‌ సీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. హోదా కవచం కప్పుకుని ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ పోరాటాలతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు