‘చంద్రబాబుపై సీబీఐ విచారణకు ఆదేశించాలి’

6 Apr, 2018 18:31 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి : కాగ్‌ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కాగ్‌ రిపోర్ట్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లకు ఉపయోగపడే పథకాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బియ్యం సరఫరాలో కుంభకోణం జరిగిందన్న కాగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సుల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని, కాగ్‌  నివేదికల ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెంచేసి దుబారా ఖర్చులు చేయడం సరికాదని, రోజువారి ఖర్చులకు అప్పుచేసి వృథా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కాగ్‌ రిపోర్ట్‌లో ఉన్నాయని, ఒక్క రూపాయి కూడా వృథా కాలేదంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు అవాస్తవాలన్నారు. ప్రజాధనాన్ని సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగించాలే తప్ప రోజువారీ ఖర్చులకు కాదని,  2.01 లక్షల కోట్ల రూపాయాల అప్పు రాష్ట్ర ప్రజలపై మోపారని మండిపడ్డారు. బడ్జెట్‌ మొత్తం అంకెల గారడిగా వర్ణిస్తూ, సబ్‌ ప్లాన్‌ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా టీడీపీ మోసం చేస్తుందని విమర్శించారు.

రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్ధులు ఉంటే 1.8 లక్షల మందికి మాత్రమే ఫీజు రియెంబర్స్‌మెంట్‌ ఇస్తుందని, పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ రాష్ట్ర పభుత్వాన్ని  ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చులో ప్రభుత్వంపై నమ్మకం లేదని... ఖర్చు చేశామని చెప్తున్నారే తప్ప వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేవన్న కాగ్‌ నివేదికను గుర్తుచేశారు. కాగ్‌ రిపోర్టుపై ఏం సమాధానం చెప్తారని చంద్రబాబును ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు