సీఎస్‌ అంటే సీఎం చెప్పిందల్లా చేయరు బాబూ!

30 Apr, 2019 12:48 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

సాక్షి, శ్రీకాకుళం : సీఎస్‌ అంటే సీఎం చెప్పిందల్లా చేయడం కాదనే విషయం చంద్రబాబు గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు ప్రధానిని పొగుడుతూ.. చం‍ద్రబాబు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే మాత్రం సీఎస్‌ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత శాఖలపై సమీక్ష చేసే అధికారం చేసే సీఎస్‌కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తీరు చూస్తుంటే 40 ఏళ్ల అనుభవంలో ఆయన ఏం గ్రహించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ఐఏఎస్‌ అంటే ఐ అగ్రీ సార్‌ కాదు..
‘సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సమర్థవంతంగా పనిచేసే అధికారి అని గుర్తింపు ఉంది. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఐఏఎస్‌ అంటే ఐ అగ్రీ సార్‌ కాదు. సీఎస్‌ నిందించడం ద్వారా చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఈసీ ఆధ్వర్యంలోనే అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. స్పీకర్‌ వ్యవస్థను అభాసుపాలు చేశారు. ఫిరాయింపుల చట్టం అమలుకాకుండా చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు నిబంధనలు కాదని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇన్ని చేసి జూన్‌ దాకా నేనే సీఎం అని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని చంద్రబాబు తీరుపై ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు