ఏపీ సీఎంపై వరప్రసాద్‌ ధ్వజం

2 Jul, 2018 11:37 IST|Sakshi
వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతున్న వరప్రసాద్‌

సాక్షి, అనంతపురం: ‘మనం ఇప్పుడు కూడా నడుం కట్టకపోతే చంద్రబాబు దుష్టపాలన అంతం కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షలు రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించార’ని తిరుపతి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం అనంతపురం లోని ఆర్ట్స్‌ కాలేజీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఈయన ముఖ్యమంత్రా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును ‘పీకే ముఖ్యమంత్రి అనొచ్చు’ అంటూ ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ జన్మభూమి కమిటీలు ఉన్నాయా అని సూటిగా అడిగారు.

చంద్రబాబు ఒక పిరికిపంద అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని సూటిగా అడిగారు. సింహం సింగల్‌గా వస్తుంది.. పిరికివాడు భయపడుతూ వెళ్తాడని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముగ్గురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. విభజన చట్టాన్ని చంద్రబాబుకు సత్తా ఉంటే అమలు చేయించాలి లేదంటే మిన్నకుండాలని సూచించారు.

ముఖ్యమంత్రికి, టీడీపీ అధ్యక్షుడికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. స్వలాభాలు, ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టారని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత లేదని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి రంగాన్ని, అందర్నీ మోసం చేశారని ఆరోపించారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరి.. ఆ తర్వాత ప్యాకేజీ సరిపోతుందని చెప్పి.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. దళితుల పట్ల చంద్రబాబు గౌరవం లేదని, దళితులను అవమానించారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అసలైన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేదవాడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారని, వైఎస్సార్‌ పాలన సువర్ణయుగమని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు