‘సిగ్గూ, శరం లేకుండా.. బాబు పనిచేశారు’

11 Dec, 2018 17:10 IST|Sakshi
సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. కూటమి రాజకీయాలను తట్టుకుని అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకొచ్చిన టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ‘కూటమి రాజకీయాలతో తన శక్తి,  యుక్తులు ప్రదర్శించి, విజయం సాధించాలనీ, తద్వారా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకుని కలలుగన్న చంద్రబాబు వ్యూహం అత్యంత దయనీయంగా, ఘోరంగా విఫలమవడం తమకు ఆనందం ఉంది’ అని అన్నారు. పార్టీ ప్రధాన కార్యలయంలో మంగళవారం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు తెలిసిన ఏకైక ‘విద్య’, ‘సామర్థ్యం’ 3ఎమ్‌ (మనీ, మీడియా, మానిప్యులేషన్స్)లు మాత్రమేనని విమర్శలు గుప్పించారు. ‌వీటిని బాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో .. సిగ్గూ, శరం లేకుండా ప్రదర్శించారని నిప్పులు చెరిగారు. ఒక దశలో బాబు వ్యూహాలు తెలంగాణలో ఎన్నికల ఫలితాలను నిర్ధేశిస్తున్నాయన్న తీరుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఏపీలో, జాతీయ స్థాయిలో చంద్రబాబుకు లబ్ది పొందాలని చూశారని ఎద్దేవా చేశారు. కూటమి 70 స్థానాలకు వరకు గెలవబోతోందని మీడియా తప్పుడు ప్రచారాలు చేసి గందరగోళం సృష్టించిందని అన్నారు. చంద్రబాబు రాకతో టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పక్కకు తొలగి.. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌, చంద్రబాబుకు మధ్యజరిగే పోరులా మారిపోయాయని అభిప్రాయపడ్డారు.

‘రాష్ట్ర విభజన అనంతరం మరింత చీకట్లోకి చేరిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. తెలంగాణ తరహాలోనే బాబు తనకు తెలిసిన కుట్రలు, కుయుక్తులు ఏపీలో ప్రయోగించాలని చూస్తున్నారు. బాబు వ్యూహాలను ఏపీలోప్రయోగించేందుకు తెలంగాణను ట్రయల్‌ గ్రౌండ్‌గా వాడుకున్నారు. బాబు క్రియేట్‌ చేసే వ్యూహంలో చిక్కుకోవద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం అప్రమంత్తంగా ఉండాలి. మనకు బాబు ఏం చేశాడో.. ఎక్కడ ఫెయిల్‌ అయ్యాడో గ్రహించాలి. వాస్తవాల ఆధారంగానే ఏ నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.

ప్రజలు ప్రలోభాలకు లొంగితే బాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూని అవుతందని హెచ్చరించారు. బాబు కుయుక్తులను  రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడమే వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఉద్ధేశమన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపు నిలబడితే.. కూటమి గెలవబోతోందని ప్రచారాలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకవేళ తక్కువ మెజారీటితో గనుక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ప్రచారం చేసేవని అన్నారు. కానీ, దాదాపు 19 మంది అభ్యర్థులు 40 వేలకు పైగా మెజారిటీ సాధించడం.. ప్రజా విజయమని టీఆర్‌ఎస్‌ను మరోసారి అభినందించారు.

మరిన్ని వార్తలు