రేపు జగ్గంపేటలో వైఎస్సార్‌ సీపీ కీలక సమావేశం

28 Jul, 2018 02:57 IST|Sakshi

పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌తో నేతల భేటీ

ఆహ్వానితులంతా తప్పనిసరిగా రావాలని ఆదేశం

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ నెల 29న పార్టీ నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశాలు ఆదివారం ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జరుగుతాయని శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆదివారం ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల సమావేశం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరుగుతుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా రావాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవే విషయాలను శుక్రవారం జగ్గంపేటలో కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మీడియాకు తెలిపారు. సభాస్థలికి వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేసినట్టు చెప్పారు. 29వ తేదీ ఉదయం పాదయాత్ర ముగిశాక సమన్వయకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశం ఏర్పాట్లను కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, తలశిల రఘురాం, సమన్వయకర్తలు రౌతు సూర్య ప్రకాశరావు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ తదితర నేతలు పరిశీలించారు. పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా నిలిచిన జగ్గంపేటలో కీలక సమావేశం జరగడం విశేషం.

మరిన్ని వార్తలు