టీజీ వెంకటేష్‌పై మండిపడ్డ హఫీజ్‌ ఖాన్‌

26 Mar, 2019 16:45 IST|Sakshi

సాక్షి, కర్నూలు : టీడీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ తన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... తన నామినేషన్‌ పట్ల పలువురు టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఖండించారు. డబ్బుతో ప్రలోభాలకు పాల్పడుతూ.. టీజీ వెంకటేష్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుకు లొంగని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి డబ్బు, బెదిరింపు రాజకీయాలను తిప్పికొట్టేందుకు కర్నూలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా టీజీ వెంకటేష్‌ కుమారడు టీజీ భరత్‌ టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సీటు కోసం ఏకంగా రూ. 100 కోట్ల మేర అధికార పార్టీ చేతులు మారినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.(ఆ సీటు... హాట్‌ కేకు..)

డ్రైనేజీ నీరు తాగాల్సి వస్తుంది..
టీజీ వెంకటేష్‌ నీచ రాజకీయాలకు తెగబడ్డారని వైఎస్సార్‌ సీపీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి విమర్శించారు. డబ్బులతో కర్నూలు ప్రజలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీల వల్ల ఆయనకు డబ్బు వస్తే... వాటి కారణంగా ప్రజలు మాత్రం జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన కుమారుడు టీజీ భరత్‌ గనుక గెలిస్తే వారి ఫ్యాక్టరీల డ్రైనేజీ నీరు తాగాల్సిన దుస్థితి వస్తుందని ప్రజలను హెచ్చరించారు.

అమలు కాని హామీలతో..
అమలు కాని హామీలు ఇచ్చి...రాష్ట్రంలో అవినీతి పాలన సాగించిన టీడీపీకి బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవీ రామయ్య ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, కార్పొరేషన్‌ నిధులు కేటాయించని చంద్రబాబు నాయుడు... ప్రజలను మభ్యపెడుతూ మరోసారి నిస్సిగ్గుగా ఓటు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు